ఏఐ వల్ల ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి

ఏఐ వల్ల ఉద్యోగాలు పోయినా మరిన్ని వస్తాయి

విశ్వంభర, సంగారెడ్డి:  కృత్రిమ మేధస్సు (ఏఐ) విస్తృత వినియోగం వల్ల తొలి దశలో కొన్ని ఉద్యోగాలు పోయినా, మున్ముందు మరిన్ని అందుబాటులోకి వస్తాయని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను ఏఐ స్థానభ్రంశం చేయవచ్చని, అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు అందుబాటులో వస్తాయని అంచనా వేశారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదులోని కెరీర్ గైడెన్స్ సెంటర్ (సీజీసీ) ఆధ్వర్యంలో ‘భవిష్యత్తును ఇంజనీరింగ్ చేయడం: ప్రధాన రంగాలలో ఆవిష్కరణలు’ అనే అంశంపై శుక్రవారం నిర్వహించిన  ఇండస్ట్రీ కాంక్లేవ్ విజయవంతంగా ముగిసింది. రానున్న రోజులలో ఉద్యోగ మార్కెట్ విస్తరిస్తూనే ఉంటుందని, అయితే ఏఐ ఆధారిత యుగానికి తగిన నైపుణ్యాలను విద్యార్థులు సమకూర్చుకోవాలని నిపుణులు సూచించారు. ముఖ్యంగా ఇంటర్న్ షిప్ లు, పరిశ్రమల సందర్శన, ఆచరణాత్మక అభ్యాసం ద్వారా తమ జ్జానాన్ని నిరంతరం మెరుగుపరచుకోవాలన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలను, ముఖ్యంగా రోజువారీ జీవితంలో అంతర్భాగంగా మారిన ఏఐపై పట్టు సాధించాలని ప్రోత్సహించారు.ఈ కాంక్లేవ్ ప్రారంభోత్సవంలో ఎన్ఎక్స్ పీ సెమీకండక్టర్స్ లో ఇండియా ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ అధిపతి ప్రీత్ యాదవ్, స్టెల్లాంటిస్ లో డెలివరీ లీడ్ సుమన్ గోర్లా ముఖ్య అతిథులుగా పాల్గొని, కీలకోపన్యాసాలు చేశారు. కోర్ ఇంజనీరింగ్ రంగాల భవిష్యత్తును రూపొందించడంలో ఆవిష్కరణ, పరిశ్రమ-విద్యా సంస్థల సహకారం  పెరుగుతున్న ప్రాముఖ్యతను  ప్రధానంగా ప్రస్తావించారు. తొలుత, గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డి.ఎస్. రావు స్వాగతోపన్యాసం చేయగా, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని స్కూల్ ఆఫ్ కోర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ రమేష్ వడ్డి సూచించారు. సీజీసీ అసిస్టెంట్ మేనేజర్ కె.వాసుదేవ్ వందన సమర్పణతో ఈ కార్యక్రమం ముగిసింది. ఇందులో సీజీసీ డైరెక్టర్ డాక్టర్ కె. మమతారెడ్డి, కోర్ ఇంజనీరింగ్ అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags: