కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టాలి 

కాంగ్రెస్ కు కర్రుకాల్చి వాత పెట్టాలి 

  • రెండున్నర ఏళ్లలో కాంగ్రెస్ ఒక్క శాశ్వత పని చేయలేదు 
  • రాష్ట్రాన్ని సర్వనాశనం చేసింది 
  • ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి

విశ్వంభర,  హనుమకొండ : పరకాల మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల కోసం మీ ఇంటి ముందుకు వచ్చే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కర్రు కాల్చి వాత పెట్టాలని ఎమ్మెల్సీ, తెలంగాణ తొలి శాసనసభాపతి సిరికొండ మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  అన్నారు. శనివారం పరకాలలోని లలిత కన్వెన్షన్ హాల్లో జరిగిన సమావేశంలో  సిరికొండ మధుసూదన చారి మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి అమలుకు వీలుగాని హామీలను ఇచ్చి గద్దెనెక్కారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండున్నర ఏళ్లలో పరకాలలో ఏ ఒక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారో  ప్రజలకు తెలపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు పరకాల అంటే సమస్యలకు కేంద్రంగా ఉండేదని, అగమ్య గోచర పరిస్థితుల్లో రాష్ట్ర పగ్గాలను చేపట్టిన సీఎం కేసీఆర్ చొరవతో అప్పటి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరకాల పట్టణ రూపరేఖలు మార్చారన్నారు. స్వరాష్ట్రంలో పరకాలకు అధునాతన రోడ్లు, సెంట్రల్ లైటింగ్, వంద పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల తోపాటు ప్రజల మౌలిక సమస్యలను పరిష్కరించడం జరిగిందని చెప్పారు. 
అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్షంలోకి రావడం, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికారంలోకి రావడం ప్రజాస్వామ్యంలో సహజమని దీనిని గుర్తెరిగి కాంగ్రెస్ ఇప్పటికైనా ప్రజా సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గత ప్రభుత్వాని కంటే మంచి పనులు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారని అలాంటి పని పరకాలలో ఏ ఒక్కటి జరగలేదని చెప్పారు. అభివృద్ధికి కొలమానంగా స్థానిక శాసనసభ్యుడు పనితీరు ఉంటుందని గత ప్రభుత్వంలో మంజూరు చేసిన పనుల శిలాఫలకాలను మారిస్తే కాదనిపేర్కొన్నారు. బిఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని చెప్పారు. కెసిఆర్ పాలనపై కాంగ్రెస్ అపోహలు, దుష్ప్రచారాలు చేసి ప్రజలను మాయ చేసి గద్దెనెక్కిందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతుందని ఇది ప్రభుత్వానికి తెలవాలంటే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థులను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ప్రజల పట్ల నిజమైన అభివృద్ధిని కాంక్షించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదని ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. అనంతరం చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డిని మించిన మోసగాడు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అని అన్నారు. రేవంత్ రెడ్డికి బుద్ధి రావాలంటే ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ నెల 9న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పరకాలకు వస్తున్నాడని చెప్పారు. బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రజల ఉద్దేశించి ప్రసంగిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమానికి బిఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఏ వార్డుకు వెళ్లినా  బిఆర్ఎస్ నే ఆదరిస్తామని ప్రజలే చెబుతున్నారని, కెసిఆర్ అందించిన ఫలాలే నేటికీ ప్రజల ఇళ్లలో ఉన్నాయని చెప్పారు. కాంగ్రెస్ పరిపాలన అంటేనే చేతకానిదని ప్రజలకు అర్థమైందని, ఇప్పుడు వారే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

Tags: