నాంపల్లి కోర్టుకు మళ్లీ బాంబు బెదిరింపు
హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి సీబీఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీగా ఉండే నాంపల్లి సీబీఐ కోర్టుకు వరుస బాంబు బెదిరింపులు రావడం నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా అపరిచిత వ్యక్తుల నుంచి వస్తున్న మెయిల్స్‌తో న్యాయస్థాన ప్రాంగణంలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. తాజాగా ఇవాళ మరోసారి సీబీఐ కోర్టులో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు మెయిల్ రావడంతో పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు కోర్టుకు చేరుకుని అణువణువూ గాలించాయి. భద్రతా కారణాల దృష్ట్యా కోర్టులోని సిబ్బందిని, న్యాయవాదులను, కక్షిదారులను వెంటనే బయటకు పంపించి ప్రాంగణాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
అప్రమత్తమైన భద్రతా బలగాలు
రెండ్రోజుల క్రితం కూడా ఇదే తరహాలో బాంబు ఉందంటూ మెయిల్ రావడంతో పోలీసులు తనిఖీలు చేపట్టింది. అయితే అదంతా ఫేక్ అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ, మళ్ళీ ఇప్పుడు అదే తరహాలో మెయిల్ రావడంతో పోలీసులు విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. కోర్టు హాల్స్, రికార్డు రూములు, పార్కింగ్ ఏరియాలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల కారణంగా కోర్టు కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా, నాంపల్లి పరిసర ప్రాంతాల్లో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతిసారీ ఇది ఫేక్ కాల్ అని తేలుతున్నా, భద్రత విషయంలో ఎలాంటి అజాగ్రత్త వహించకూడదని పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.
తమిళనాడు పోలీసుల హస్తం?
ప్రాథమిక విచారణలో ఈ బెదిరింపుల వెనుక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలో వచ్చిన బెదిరింపు మెయిల్స్‌కు తమిళనాడుకు చెందిన కొందరు పోలీసు సిబ్బందికి సంబంధం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమ శాఖలోని ఉన్నతాధికారుల నుంచి ఎదురవుతున్న తీవ్రమైన వేధింపులను తట్టుకోలేక, ఏం చేయాలో పాలుపోక దృష్టి మళ్లించేందుకే న్యాయస్థానాలను టార్గెట్ చేసుకుని ఇలాంటి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. తాజాగా వచ్చిన మెయిల్ కూడా అదే ముఠా పనినా లేక మరెవరైనా ఆకతాయిలు పంపారా అనే కోణంలో సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఐపీ అడ్రస్ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.



