తెలంగాణ పంచాయతీలకు కేంద్రం గుడ్‌న్యూస్
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా మూడో విడత కింద రూ.387.53 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. 15వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా మూడో విడత కింద రూ.387.53 కోట్లను విడుదల చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే మొదటి విడతలో రూ.259.36 కోట్లు, రెండో విడతలో రూ.387 కోట్లు అందించింది. తాజా విడుదలతో కలిపి ఇప్పటివరకు మొత్తం రూ.1034.42 కోట్లు రాష్ట్రానికి చేరాయి. ఈ క్రమంలో కేంద్రం నుంచి అందిన నిధులను రాష్ట్ర ఆర్థిక శాఖ వెంటనే పంచాయతీలకు మళ్ళిస్తోంది. ఇందులో భాగంగానే గత మంగళవారం రూ.256 కోట్లను గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సుదీర్ఘ కాలం ఆలస్యం కావడంతో, గత రెండేళ్లుగా 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో స్తబ్దత నెలకొంది. ఎన్నికల నిర్వహణ లేకపోవడంతో సాంకేతిక కారణాల రీత్యా కేంద్రం ఈ నిధులను నిలిపివేసింది. అయితే, గతేడాది డిసెంబర్‌లో రాష్ట్రంలోని పంచాయతీలకు కొత్త పాలక వర్గాలు కొలువుదీరడంతో కేంద్రం నుంచి నిధులు విడుదలవుతున్నాయి. ప్రస్తుతం విడుదలవుతున్న ఈ నిధులు గ్రామాల్లోని పెండింగ్ పనులకు ఉపయోగించనున్నారు. స్థానిక అవసరాల దృష్ట్యా ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు గ్రామాల వారీగా విడుదల చేస్తూ యంత్రాంగాన్ని పరుగులు పెట్టిస్తోంది.
ఇంకా రావాల్సిన నిధులు రూ. 2000 కోట్లు
కేంద్రం నుంచి నిధులు అందుతున్నప్పటికీ, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు ఇంకా భారీగానే ఉన్నాయి. మరో రూ.2000 కోట్ల మేర పెండింగ్ నిధులు రావాల్సి ఉందని తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామాల సమగ్ర అభివృద్ధికి ఈ నిధులు అత్యవసరమని, కేంద్ర ప్రభుత్వం రాజకీయాలకు తావు లేకుండా వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు. అప్పుడే పల్లెల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి స్థాయిలో సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
పెండింగ్ బిల్లులకు ప్రాధాన్యత
ప్రస్తుతం విడుదలైన నిధులను గ్రామాల్లో పారిశుధ్యం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, గత కొంతకాలంగా నిలిచిపోయిన పెండింగ్ బిల్లుల చెల్లింపులకే వెచ్చించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నిధుల వినియోగంలో పారదర్శకత పాటిస్తూ, అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆమె సూచించారు. పంచాయతీలకు నిధుల కటకట తీరుతుండటంతో అటు సర్పంచ్‌లు, ఇటు గ్రామీణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



