అర్హులైన పేదలందరికీ ఇళ్లు
- ఎమ్మెల్యే వేముల వీరేశం
విశ్వంభర, రామన్నపేట: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు సొంత ఇండ్లు వచ్చాయని, గత ప్రభుత్వ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇవ్వలేదని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన ఏర్వ మమత, గణేష్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఆయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నకిరేకల్ నియోజకవర్గంకు తొలి విడతగా 3,500 ఇండ్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఇండ్లు లేని ప్రతి పేద కుటుంబానికి విడతల వారీగా ఇళ్లు మంజూరు చేసి, వారి సొంతింటి కలను సాకారం చేస్తామని స్పష్టం చేశారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపరచడం ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిరిగిరెడ్డి మల్లారెడ్డి, మండల ప్రజా ప్రతినిదులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



