ద్విచక్రవాహనం చెట్టును ఢీకొని.. ఒకరి మృతి
విశ్వంభర, బచ్చన్నపేట: ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొని ఒకరి మృతి చెందిన సంఘటన మండలంలోని పోచన్నపేట శివారులో చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ మండలం వెంకిర్యాల గ్రామానికి చెందిన తాళ్లపల్లి సారయ్య(37) కు 2 సంవత్సరాలు క్రితం వివాహం జరిగింది. ఆయనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెయింటింగ్ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత ఐదు సంవత్సరాల నుంచి యాదాద్రి జిల్లా ఆలేరు మండల కొలనుపాకలో అత్తగారి ఇంటి వద్ద సారయ్య కుటుంబ సభ్యులు ఉంటున్నారు. బుధవారం ఉదయం వెంకిర్యాలలోని తన వ్యవసాయ బావి వద్ద కు పనుల నిమిత్తం వచ్చారు. రాత్రి తిరుగు ప్రయాణంలో జనగామ మండలం పెద్దరాంచర్ల, పోచన్నపేట గ్రామాల మధ్యలో ద్విచక్రవాహనం అదుపు తప్పి చెట్టుకు ఢీకొని అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.



