బాండ్ పేపర్ల హామీలు ఏమైపోయాయి?: హరీశ్ రావు

బాండ్ పేపర్ల హామీలు ఏమైపోయాయి?: హరీశ్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన వాగ్దానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం కాలం పూర్తయినా, ఎన్నికల వేళ ప్రజలకిచ్చిన వాగ్దానాలు మాత్రం కాగితాలకే పరిమితమయ్యాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ బాండ్ పేపర్లు రాసిచ్చిన విషయాన్ని గుర్తు చేస్తూ.. నేటికి 800 రోజులు గడిచినా ఒక్క హామీకి కూడా దిక్కులేదని విమర్శించారు. ఇవాళ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరీశ్ రావు.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాయ మాటలతో ప్రజలను వంచిస్తోందని మండిపడ్డారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనైనా వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ రూపొందించాలని, అంకెల గారడీ మానేసి ప్రజలకిచ్చిన హామీలకు స్పష్టమైన నిధులు కేటాయించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

అమలు కాని అభయహస్తం 
గెలిచిన నెల రోజులకే వృద్ధులు, బీడీ, చేనేత, గీత కార్మికులకు రూ.4000 పెన్షన్ ఇస్తామని చెప్పి 27 నెలలవుతున్నా ఒక్క అడుగు ముందుకు పడలేదని హరీశ్ రావు దుయ్యబట్టారు. ఈ బడ్జెట్‌లోనైనా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క దీనికి నిధులు పెడతారా లేదా అని ప్రశ్నించారు. అదే విధంగా, మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ.2,500 ఇస్తామని ఆశచూపి మహిళల ఓట్లు దండుకున్న కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన ఫీజు రీయింబర్స్ మెంట్ నిధులను కూడా ఈ ప్రభుత్వం ఎగ్గొట్టిందని, రాజీవ్ యువ వికాసం వంటి పథకాలన్నీ కేవలం ప్రచారానికే పరిమితమయ్యాయని హరీశ్ రావు ఎద్దేవా చేశారు.

Read More నా రక్తం మరిగిపోతుంది : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు

డిక్లరేషన్ల పేరిట మోసం
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎస్సీ, బీసీ, రైతు డిక్లరేషన్లన్నీ పచ్చి అబద్ధాలని హరీశ్ రావు విమర్శించారు. ఎస్సీ సబ్ ప్లాన్, 18 శాతం రిజర్వేషన్ల హామీ దళితులను మోసం చేయడానికేనని, కామారెడ్డిలో సిద్ధరామయ్యను సాక్షిగా పెట్టి ప్రకటించిన బీసీ డిక్లరేషన్ అమలు ఎక్కడని ఆయన ప్రశ్నించారు. బీసీలకు రూ.20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు మొండిచేయి చూపారని మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట రాహుల్ గాంధీ ద్వారా చెప్పించిన రూ.15,000 రైతుబంధు, పంటల బీమా, బోనస్ వంటి హామీలు నీటి మూటలయ్యాయని, అన్నదాతలను ప్రభుత్వం నిలువునా దగా చేసిందని ఆరోపించారు. గత అసెంబ్లీలో బల్లలు చరిచి చెప్పిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ఎక్కడికి పోయాయని నిలదీస్తూ, కనీసం ఈ బడ్జెట్‌లోనైనా బాధితులందరికీ న్యాయం చేయాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు.