పార్టీ ఫిరాయింపు కేసులో సుప్రీంను ఆశ్రయించిన బీజేపీ
స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత అంశం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో జాప్యం జరుగుతోందంటూ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, కానీ స్పీకర్ ఆ ఆదేశాలను ఏ మాత్రం పాటించడం లేదని ఏలేటి మహేశ్వర్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. న్యాయస్థానాన్ని గౌరవించకుండా నిర్ణయాన్ని కావాలనే సాగదీస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ వ్యవహారాన్ని ఏలేటి ప్రత్యేకంగా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనేనని, ఎంపీగా కూడా పోటీ చేశానని దానం స్వయంగా ప్రకటించిన విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు. పార్టీ మారినట్లు ఆయనే ఒప్పుకున్నాక అనర్హత వేటు వేయడంలో జాప్యం ఎందుకని ప్రశ్నించారు.
ఇప్పటికే ఈ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. "కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారు. ఈ పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా? లేక మమ్మల్నే తీసుకోమంటారా?" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తూ రెండు వారాల గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఏలేటి మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో పెండింగ్‌లో ఉంది. దీనికి నంబర్ కేటాయించిన తర్వాత విచారణ తేదీ ఖరారు కానుంది. ఒకవేళ సుప్రీంకోర్టు దీనిని ధిక్కరణ కేసుగా పరిగణిస్తే, స్పీకర్ కార్యాలయానికి ఇబ్బందులు తప్పవని న్యాయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.



