ప్రజావాణి దరఖాస్తులను తక్షణం పరిష్కరించాలి
- జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్
విశ్వంభర, మహబూబాబాద్: సోమవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టోప్పో,కె.అనిల్ కుమార్, జిల్లా అధికారులు, సంబంధిత మండలాల నుండి గూగుల్ మీట్ ద్వారా ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు చేసుకున్న దరఖాస్తులను సానుకూలంగా వింటూ సంబంధిత అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేసారు.స్వయంగా ఈ సోమవారం వినూత్న రీతిలో మండల ప్రధాన కార్య స్థానం నుండి తహసీల్దారులకు గూగుల్ మీట్ ద్వారా ఆదేశాలు జారీ చేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు. ప్రజలు చేస్తున్న న్యాయమైన సమస్యల దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో సంబంధిత విభాగాలకు సిఫారసు చేయాలని లేదా సరియైన విధంగా సూచనలు, సలహాలు అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైల్ లను క్లియర్ చేయాలని, పరిసరాలను పరిశుభ్రముగా ఉంచుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు, సంబంధిత సిబ్బంది తరచుగా వారికి కేటాయించిన వసతి గృహాలు హాస్టలను విద్యాసంస్థలను తనిఖీ చేస్తూ విద్యార్థిని, విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, వసతి గృహాలలో సౌకర్యాల కల్పనలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా ఇనుగుర్తి మండలం లాలుతండ కు చెందిన గుగులోతు సత్తి గత 30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న ఇనుగుర్తి శివారులోని తమ భూమికి ఆర్.ఓ.ఎఫ్.ఆర్. కింద సర్వే చేయించి పట్టా చేపించి ఇప్పించగలరని కోరారు. కేసముద్రం మండలం గాంధీనగర్ కు చెందిన భూక్య హుస్సేనీ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా ఆ ఇల్లును బేస్ మెంట్ వరకు నిర్మించుకున్నానని, బేస్ మెంట్ ను పరిశీలించి తనకు బిల్లును మంజూరు చేయాలని కోరారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో తొర్రూరు రెవిన్యూ డివిజనల్ అధికారి గణేష్, జెడ్పి సీఈవో పురుషోత్తం, అన్ని విభాగాల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, గూగుల్ మీ ద్వారా తహసిల్దారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.



