ఎంబీసీ కులాలకు కేటాయించిన స్థలం వెంటనే అప్పగించాలి
- సంచార జాతుల నాయకుల డిమాండ్
విశ్వంభర, ఉప్పల్ భగాయత్: ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో ఎంబీసీ (సంచార జాతుల) కులాలకు కేటాయించిన 10 ఎకరాల ప్రభుత్వ స్థలంను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్‌కు కేటాయించనున్నట్లు పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకోవడానికి సంచార జాతుల నాయకులు ఈ రోజు ఆ స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ సంచార జాతుల సంక్షేమ అధ్యక్షులు కాటపల్లి వీరాస్వామి బీజేపీ ఓబీసీ డీఎన్‌టీ సెల్ కన్వీనర్ చేవ్వ చిత్తరంజన్ తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.ఎస్. నరహరి , ప్రధాన కార్యదర్శి జెల్లి సవంత్ గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు జెల్లల నర్సింహా కలిసి ఉప్పల్ భగాయత్‌లో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. గత ప్రభుత్వ కాలంలో ఎంబీసీ కులాల సంక్షేమం కోసం ఈ 10 ఎకరాల స్థలం కేటాయించబడింది. అప్పటి బీసీ కమిషన్ చైర్మన్ వాకులాబరణం కృష్ణమోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని శిలాఫలకం ఆవిష్కరించారు. అయితే ప్రస్తుతం ఆ శిలాఫలకం అక్కడ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. అదే స్థలాన్ని అధికారులు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ అవసరాలకు పరిశీలించినట్లు పత్రికల్లో వార్తలు రావడం ఎంబీసీ కులాలపై తీవ్రమైన అన్యాయం అని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర కులాలకు కేటాయించిన స్థలాల్లో ప్రహరీ గోడలు నిర్మించగా, ఎంబీసీ కులాలకు కేటాయించిన ఈ స్థలం మాత్రం ఇప్పటివరకు చదును చేయకపోవడం, ఎలాంటి నిర్మాణాలు చేయకపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఎంబీసీ కులాలకు కేటాయించిన 10 ఎకరాల స్థలాన్ని యథాతథంగా వారికి అప్పగించాలని ఆ స్థలంలో అభివృద్ధి పనులు ప్రారంభించాలని లేకపోతే ఎంబీసీ సంఘాలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడతాయని హెచ్చరించారు.



