కీసరలో నీటి కష్టాలు
విశ్వంభర, మేడ్చల్: మండలంలోని చీర్యాల జిన్నారం కాలనీలో గత ఏడు నెలలుగా తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని, వెంటనే మంచినీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కీసర సర్కిల్ ఆఫీస్ 'ప్రజావాణి' కార్యక్రమంలో మహిళలు ఖాళీ బిందెలతో భారీ ధర్నా నిర్వహించారు. గత ఏడు నెలలుగా జిహెచ్ఎంసి నుంచి వచ్చే మంచినీటి ట్యాంకర్లను నిలిపివేయడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నిరసనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీకి రోజుకు కనీసం రెండు ట్యాంకర్ల చొప్పున మంచినీటిని సరఫరా చేసేలా శాశ్వత వ్యవస్థను ఏర్పాటు చేయాలని కీసర మండల భాజపా అధ్యక్షులు కోల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేశారు. త్రాగునీరు లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే మురుగు నీరు భూమిలో ఇంకడం వల్ల భూగర్భజలంలోని నీరు కలుషితమై బోరు నీరు తాగి రోగాల పాలవుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి వాటర్ ట్యాంకర్ తో నీటి సప్లై చేయాలని అధికారులను కోరారు. ఈ ధర్నాపై డిప్యూటీ కమిషనర్ కమిషనర్ వసంత, జిహెచ్ఎంసి వాటర్ డిపార్ట్మెంట్ ఇన్చార్జ్ వెంకటేష్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే ట్యాంకర్లు పంపిస్తామని వారు హామీ ఇవ్వడంతో మహిళలు తమ నిరసనను విరమించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు కోలా బాలరాజు యాదవ్ పాల్గొని కాలనీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అధికారులతో చర్చించారు



