జర్నలిస్టులను అర్దరాత్రి నేరస్తులా పట్టుకోవడం అత్యుత్సాహమే
జర్నలిస్టుల అరెస్టులపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్
రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల పర్వం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అర్ధరాత్రి వేళ జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశ్వంభర తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో జర్నలిస్టుల అరెస్టుల పర్వం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. అర్ధరాత్రి వేళ జర్నలిస్టులను అదుపులోకి తీసుకోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం "ఎమర్జెన్సీ" పాలనను తలపిస్తోందని, మీడియా స్వేచ్ఛను హరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు.పండుగ వేళ ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా 'ఎక్స్' వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు
బీఎన్ఎస్ సెక్షన్ 35 ప్రకారం నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశం ఉన్నా, అర్ధరాత్రి ఇళ్లలోకి వెళ్లి జర్నలిస్టులను నేరస్తుల్లా పట్టుకోవడం అత్యుత్సాహమే అని కేటీఆర్ విమర్శించారు. జర్నలిస్టులను నేరస్తుల్లా వ్యవహరించేందుకు తెలంగాణ డీజీపీ ఎంతగా పట్టుబడుతున్నారో చూడటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వారికి నోటీసులు ఇచ్చి, విచారణకు పిలవవచ్చు కదా అని ప్రశ్నించారు. అలా చేయకుండా, అర్ధరాత్రి జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి అరెస్టులు చేయడం అత్యుత్సాహం, హద్దులు దాటిన చర్య అని విమర్శించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల చర్యల వల్ల జర్నలిస్టుల కుటుంబాలు భయభ్రాంతులకు గురవుతున్నాయని, ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని పేర్కొన్నారు. తెలంగాణ డీజీపీ చట్టబద్ధమైన విధానాన్ని పాటించాలని, కాంగ్రెస్ పార్టీ, దాని అప్రామాణిక నాయకత్వం చేస్తున్న చెడు రాజకీయాలకు పాల్పడకుండా ఉండాలని తాను కోరుతున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. కక్ష సాధింపు చర్యలు ఆపాలని.. అసలు సమాచారం 'లీక్' చేసిన వ్యక్తిని పట్టుకోవాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ.. మీ 'మొహబ్బత్ కీ దుకాన్' తెలంగాణ శాఖ పౌరుల రాజ్యాంగ హక్కులను ఎలా కాలరాస్తోందో గమనిస్తున్నారని ఆశిస్తున్నాను అంటూ ఎద్దేవా చేశారు.
వివాదం నేపథ్యం ఇదే..
ఇటీవల ఒక మహిళా ఐఏఎస్ అధికారిణి, ఒక మంత్రికి సంబంధించి సోషల్ మీడియాలో, కొన్ని న్యూస్ ఛానళ్లలో వచ్చిన కథనాలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సదరు అధికారిణి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయన్న ఆరోపణలతో పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఎన్టీవీ యాజమాన్యం బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్లు పరిపూర్ణాచారి, సుధీర్ లను పోలీసులు శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అరెస్ట్ చేశారు.



