ఈటల, రాజశేఖర్ రెడ్డి మధ్య మాటల యుద్ధం..!!
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారింది.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మేడ్చల్ జిల్లా మచ్చబొల్లారంలో రైల్వే అండర్‌బ్రిడ్జి నిర్మాణానికి నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమం రాజకీయ ఉద్రిక్తతలకు వేదికగా మారింది. ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వంతెన నిర్మాణానికి అవసరమైన నిధులను ఎవరు తీసుకొచ్చారనే అంశంపై ఇరువురు నేతలు పరస్పరం మాటల యుద్ధానికి దిగారు. ఒక్కొక్కరూ తామే ప్రధాన పాత్ర పోషించామని చెప్పడంతో వాతావరణం క్షణాల్లో ఉద్రిక్తంగా మారింది.
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో కార్యక్రమ స్థలంలో కొంతసేపు గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాటల తూటాలు కాస్తా తోపులాటకు దారి తీయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. దీంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని ఇరువర్గాలను విడదీశారు.
వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకున్న సమయంలో ఈటల రాజేందర్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ కార్యక్రమ స్థలం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటన స్థానికంగా రాజకీయ చర్చకు దారి తీసింది. ప్రజాప్రయోజనాల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమం రాజకీయ వివాదంగా మారడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



