కామారెడ్డిలో దారుణం.. 600 వీధి కుక్కల మృతి

కామారెడ్డిలో దారుణం.. 600 వీధి కుక్కల మృతి

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఐదు గ్రామాలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు కలిసి భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఐదు గ్రామాలకు చెందిన గ్రామ సర్పంచ్‌లు కలిసి భారీ సంఖ్యలో వీధి కుక్కలను హతమార్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. పాల్వంచ, ఫరీద్‌పేట, బండారామేశ్వర్‌పల్లి, భవానీపేట్, వాడి గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న వీధి శునకాలకు విష ఇంజెక్షన్లు, విష గుళికలు పెట్టి చంపి, అనంతరం గ్రామ శివారుల్లో పూడ్చివేసినట్లు జంతు ప్రేమికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read More జనవరి 18న  సర్పంచ్ , ఉప సర్పంచ్ , వార్డ్ మెంబర్లకు ఘన సన్మానం 

 

ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చర్యలకు దిగారు. గ్రామాల సమీపంలో పాతిపెట్టిన కుక్కల మృతదేహాలను జేసీబీ సహాయంతో వెలికితీసి, వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో పోస్టుమార్టం నిర్వహించారు. స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మేనేజర్ మాట్లాడుతూ, తమ బృందం సేకరించిన సమాచారం ప్రకారం సుమారు ఐదు గ్రామాల్లో దాదాపు 600 వీధి కుక్కలను విష పదార్థాల ద్వారా హతమార్చిన ఆనవాళ్లు బయటపడ్డాయని తెలిపారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా జంతు హక్కుల కార్యకర్తలను కలవరపెడుతోందన్నారు.

 

సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో కుక్కలను తొలగిస్తామని కొందరు సర్పంచ్‌లు ఇచ్చిన హామీలను అమలు చేయడానికే ఈ దారుణానికి పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూగజీవులను ఇలా నిర్దాక్షిణ్యంగా హతమార్చడం ఎంతవరకు సమంజసమని జంతు ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. వీధి కుక్కల సమస్యకు హింసే పరిష్కారం కాదని, రేబిస్ వంటి వ్యాధుల నివారణకు ముందస్తు టీకాలు వేయడం, శాస్త్రీయమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని వారు సూచించారు.

 

ఘటనపై మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో సంబంధిత గ్రామ సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులపై ఫిర్యాదు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో గ్రామ పాలకులు, అధికారులే కలిసి ఈ చర్యకు పాల్పడ్డారన్న అనుమానాలు బలపడుతున్నాయని తెలిపారు. మాచారెడ్డి ఎస్‌ఐ అనిల్ స్పందిస్తూ, ఐదు గ్రామాల సర్పంచ్‌లపై కేసులు నమోదు చేసి, ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నామని వెల్లడించారు. ఈ కేసు పరిణామాలు తీవ్రంగా మారే అవకాశం ఉందని పోలీసులు పేర్కొన్నారు.

dogs

Tags: