ఈ నెల 11న పబ్లిక్ హాలిడే
- జిల్లా ఎన్నికల అధికారి ప్రావీణ్య
విశ్వంభర, సంగారెడ్డి: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియో గించుకునేందుకు, జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11 న ప్రభుత్వ సెలవుగా ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 11న ఎన్నికలు జరగనున్న సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం, ఆందోల్–జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలకు పబ్లిక్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ తెలిపారు.
ఎన్నికలు జరగనున్న సంబంధిత మున్సిపాలిటీల పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు , వ్యాపార సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 ప్రకారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని సంబంధిత యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు ఫిబ్రవరి 10 నాడు కూడా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అదేవిధంగా, ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలకు లెక్కింపుకు ముందు రోజు అయిన ఫిబ్రవరి 12 లెక్కింపు రోజు ఫిబ్రవరి 13 ) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని పేర్కొన్నారు.



