అమర కానిస్టేబుల్ కుటుంబాలకు 'కోటి' భరోసా
విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సమాజ రక్షణ కోసం పోరాడిన అమర కానిస్టేబుళ్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిజామాబాద్ పర్యటనలో పెద్దపీట వేశారు.
విశ్వంభర, తెలంగాణ బ్యూరో: విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సమాజ రక్షణ కోసం పోరాడిన అమర కానిస్టేబుళ్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిజామాబాద్ పర్యటనలో పెద్దపీట వేశారు. గంజాయి ముఠా దాడుల్లో వీరమరణం పొందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య, దుండగుల కత్తిపోట్లకు బలైన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి ఎక్స్‌గ్రేషియా చెక్కులను సీఎం స్వయంగా అందజేశారు.
సౌమ్య సాహసం.. గంజాయి ముఠాపై పోరు
నిజామాబాద్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో గత నెల 23న సౌమ్య చూపిన తెగువ అసాధారణం. అక్రమ రవాణాదారులు వాహనంతో ఆమెను ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన సౌమ్య, హైదరాబాద్ నిమ్స్‌లో చికిత్స పొందుతూ జనవరి 31న కన్నుమూశారు. కేవలం 25 ఏళ్ల వయసులోనే ఆమె చేసిన ప్రాణత్యాగం రాష్ట్ర పోలీసు రంగానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె కుటుంబానికి కోటి రూపాయల సాయంతో పాటు ఆమె సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం, సర్వీస్ ముగిసే వరకు పూర్తి వేతనం అందజేస్తామని ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది.
ప్రమోద్ కుమార్ త్యాగానికి గుర్తింపు
గత ఏడాది అక్టోబరులో విధి నిర్వహణలో ఉండగా రౌడీషీటర్ రియాజ్ జరిపిన కత్తి దాడిలో మృతి చెందిన కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి కూడా రూ.కోటి ఆర్థిక సాయాన్ని సీఎం అందించారు. ఈ సాయంతో పాటు ఆయన కుటుంబానికి ఇంటి స్థలం, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రభుత్వం ఇప్పటికే ఖరారు చేసింది.
నేరుగా బాధితుల వద్దకు ముఖ్యమంత్రి
మున్సిపల్ ఎన్నికల ప్రచార హడావుడిలో ఉన్నప్పటికీ, నిజామాబాద్ పర్యటనలో భాగంగా ఆ ఇద్దరు వీరుల కుటుంబాలను ప్రత్యేకంగా కలిసిన రేవంత్ రెడ్డి, వారిని ఓదార్చి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం మీకు ఎప్పుడూ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి ఎంతో మంది నాయకులు కృషి చేశారని, ఇలాంటి సాహసోపేతమైన అధికారుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.



