అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం

అంబేద్కర్ ఆశయాలే సమాజానికి మార్గదర్శకం

  •  ఐటీడీఏ పీఓ రాహుల్

విశ్వంభర, భద్రాచలం: భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలు భారతదేశ చరిత్రలో అజరామరమని, ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరి జీవితానికి మార్గదర్శకమని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి  రాహుల్ అన్నారు. మంగళవారం ఐటిడిఏ కార్యాలయ సమావేశ మందిరంలో అంబేద్కర్ 135వ జయంతిని  ఘనంగా నిర్వహించారు. ఈ  కార్యక్రమంలో ఆయన పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సమాజంలో ఉన్న అంటరానితనం, అసమానతలు, కుల వివక్షలను నిర్మూలించేందుకు అంబేద్కర్ చేసిన కృషి అపారమని పేర్కొన్నారు. సమాన హక్కులు, సామాజిక న్యాయం, ఆర్థిక సాధికారత కోసం ఆయన జీవితాంతం చేసిన పోరాటం దేశానికి దిశానిర్దేశం చేసిందని అన్నారు. భారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన చూపిన దూరదృష్టి వల్లే ప్రతి పౌరుడికి హక్కులు, రక్షణ కల్పించబడినట్లు తెలిపారు. అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాత మాత్రమే కాకుండా, అణగారిన వర్గాల స్వరంగా నిలిచిన మహానేత అని, దళితులు, గిరిజనులు, మహిళలు, కార్మికులు, కర్షకుల హక్కుల కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ సమానంగా ఎదగాలనే లక్ష్యంతో ఆయన పలు సంస్కరణలు చేపట్టారని వివరించారు. చదువు ద్వారానే మనిషి ఎదుగుదల సాధ్యమని, విద్యను ఆయుధంగా మార్చుకొని ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని సూచించారు. యువత అంబేద్కర్ ఆశయాలను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణతో చదువుకొని సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు. గిరిజన ప్రాంతాల్లో విద్యా అవకాశాలను విస్తరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పనితీరులో ప్రతిబింబించాలని అన్నారు. డిడి ట్రైబల్ వెల్ఫేర్ అశోక్ మాట్లాడుతూ గిరిజనుల అభివృద్ధి కోసం విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాల్లో మరింత శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. ఆర్‌సి‌ఓ గురుకులం అరుణకుమారి మాట్లాడుతూ విద్యార్థులు అంబేద్కర్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, పివిటీజి అధికారి గన్యా నాయక్, ఏపీఓ పవర్ వేణు తదితరులు కూడా అంబేద్కర్ సేవలను స్మరించుకొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డీఎం జీసిసి సమ్మయ్య, ఏ సీఎంవో రమేష్, ఏ డిఎంహెచ్ఓ సైదులు, ఏవో సున్నం రాంబాబు, డీఎస్ఓ ప్రభాకర్ రావు, మేనేజర్ ఆదినారాయణ, జయరాజ్, ఐటిడిఏ సిబ్బంది, పర్యవేక్షకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags: