అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ 

విశ్వంభర, భద్రాచలం: భద్రాచలం పట్టణంలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా మంగళవారం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తన కార్యాలయంలో అగ్నిమాపక శాఖ సిబ్బందితో కలిసి వారోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తున్న ఈ వారోత్సవాల ఉద్దేశ్యం ప్రజల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన పెంపొందించడం, అప్రమత్తతను కల్పించడం అని  తెలిపారు. ఈ సందర్భంగా మృనాల్ శ్రేష్ట మాట్లాడుతూ, వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా చిన్న అజాగ్రత్త కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశముందని హెచ్చరించారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గడ్డివాములు, పొలాల్లో నిల్వ ఉంచే పొడి గడ్డి, తాటాకు ఇళ్లు వంటి చోట్ల అగ్ని ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటుందని చెప్పారు. పట్టణాల్లో హోటళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, వాణిజ్య సముదాయాల్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు, గ్యాస్ లీకేజీలు వంటి కారణాలతో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని వివరించారు. ప్రజలు గ్యాస్ సిలిండర్ల వినియోగంలో జాగ్రత్తలు పాటించడం, విద్యుత్ వైర్లను సరిగా నిర్వహించడం, అవసరం లేని సమయంలో విద్యుత్ ఉపకరణాలను ఆఫ్ చేయడం వంటి సాధారణ చర్యల ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలను అగ్నితో ఆడనీయకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, పొగత్రాగేవారు సిగరెట్ ముక్కలను నిర్లక్ష్యంగా వేయకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ప్రాణాలు, ఆస్తులను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడిన ఆయన, వారి సేవలు సమాజానికి అమూల్యమని పేర్కొన్నారు. ప్రజలు అత్యవసర సమయంలో అగ్నిమాపక శాఖను వెంటనే సంప్రదించాలని, ఆలస్యం చేయకుండా సమాచారం అందిస్తే నష్టం తగ్గించవచ్చని తెలిపారు. వారోత్సవాల సందర్భంగా పట్టణంలోని ప్రధాన కూడళ్లలో, విద్యాసంస్థల్లో, మార్కెట్ ప్రాంతాల్లో మరియు పల్లె సంతల్లో అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీలు, ప్రదర్శనలు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, ఎలా బయటపడాలి, ఎలా ఇతరులను రక్షించాలి అనే అంశాలపై ప్రాక్టికల్ డెమోలను నిర్వహిస్తామని తెలిపారు. ఇంటి వద్ద అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వెంటనే మెయిన్ స్విచ్ ఆఫ్ చేయడం, గ్యాస్ సరఫరాను నిలిపివేయడం, నీరు లేదా ఇసుకతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నించడం వంటి ప్రాథమిక చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. పెద్ద అగ్ని ప్రమాదాల సమయంలో స్వయంగా ప్రయత్నించకుండా వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అలాగే ప్రతి కార్యాలయం, విద్యాసంస్థ, వాణిజ్య సముదాయం వద్ద అగ్ని మాపక పరికరాలు తప్పనిసరిగా ఉండాలని, వాటి వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా పరిశీలించాలని ఆయన ఆదేశించారు. ప్రజలందరూ ఈ వారోత్సవాల్లో చురుకుగా పాల్గొని అగ్ని ప్రమాదాలపై పూర్తి స్థాయి అవగాహన పొందాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని ఆయన పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం అగ్నిమాపక కేంద్రం ఇన్‌చార్జి ఫైర్ ఆఫీసర్ ఎండి. సాధిక్‌తో పాటు అగ్నిమాపక సిబ్బంది రమేష్, కుమార్, వెంకట్రామిరెడ్డి, హరీష్, ప్రకాష్, నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: