కేజీబీవీ లో అవగాహన కార్యక్రమం
విశ్వంభర, వలిగొండ : యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, లోతుకుంట గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో, మండల లీగల్ సర్వీసెస్ కమిటీ, రామన్నపేట ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి డి. సత్యయ్య ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన తన ప్రసంగంలో డా. బి.ఆర్. అంబేద్కర్ , చిరస్మరణీయ కృషి, సామాజిక మార్పు కోసం చేసిన పోరాటం, ముఖ్యంగా మహాద్ సత్యాగ్రహం వంటి చారిత్రక సంఘటనల ప్రాముఖ్యతను వివరించారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఉన్న ముఖ్యమైన హక్కులు అయిన ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు), ఆర్టికల్ 17 (అస్పృశ్యత నిర్మూలన), ఆర్టికల్ 21A (విద్య హక్కు) గురించి విద్యార్థులకు సవివరంగా తెలియజేశారు. సమాజంలో సమానత్వం, సామాజిక న్యాయం స్థాపనలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. విద్యార్థులను ఉద్దేశించి, “మీ చదువు మీకు కేవలం హక్కులను మాత్రమే కాకుండా, వివేకాన్ని కూడా అందించాలి. రాజ్యాంగం మీ చేతిలో ఉన్న గొప్ప ఆయుధం. దానిని బాధ్యతగా వినియోగించండి. డా. బి.ఆర్. అంబేద్కర్, చూపిన మార్గంలో నడుస్తూ, ఈ దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లండి” అని ప్రేరణాత్మకంగా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ప్యానెల్ అడ్వకేట్ బి. డేవిడ్ , మాట్లాడుతూ, లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సహాయం, మహిళల హక్కులు, బాలికల రక్షణ చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ సిబ్బంది జ్యోతి, మాధవి, అనుష, శైలజ పాల్గొన్నారు.



