అగ్నిమాపక సేవల వారోత్సవాలు ప్రారంభం 

అగ్నిమాపక సేవల వారోత్సవాలు ప్రారంభం 

విశ్వంభర, సంగారెడ్డి: అగ్నిమాపక సేవల వారోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల భద్రతపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం జరిగిన వారోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా పలు ప్రదేశాల్లో మాక్ డ్రిల్లులు, అవగాహన ర్యాలీలు, శిక్షణ కార్యక్రమాలు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రజలు అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.1944 సంవత్సరంలో బాంబే నగరంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో వీరమరణం పొందిన అగ్నిమాపక సిబ్బందిని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు “అగ్నిమాపక సేవల వారోత్సవం”ను నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన ర్యాలీలు, పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ఫంక్షన్ హాళ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ మరియు ఇతర ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో మాక్ డ్రిల్లులు చేపట్టనున్నట్లు తెలిపారు. మాక్ డ్రిల్లులు నిర్వహించే ప్రదేశాల్లో పాంఫ్లెట్లు, బ్రోచర్లు పంపిణీ చేసి అవగాహన కల్పిస్తారని, గృహాలు, కార్యాలయాల్లో తీసుకోవాల్సిన అగ్ని భద్రతా చర్యలపై శిక్షణ కార్యక్రమాలు, అగ్ని ప్రమాదాల సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలపై ప్రదర్శనలు  నిర్వహిస్తారని తెలిపారు. మంగళవారం ఉదయం జరిగిన ప్రారంభ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్  నిర్మల జగ్గారెడ్డి, పటాన్‌చేరు ఎమ్మెల్యే  మహిపాల్ రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే  సంజీవ రెడ్డి, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్  ఉమా హారతి, తదితర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అగ్నిమాపక సేవల వారోత్సవాల పాంఫ్లెట్లు, పోస్టర్లను ఆవిష్కరించి వారోత్సవాన్ని ప్రారంభించారు .గత సంవత్సరం (2025)లో సంగారెడ్డి జిల్లాలో మొత్తం 576 అగ్ని ప్రమాదాలు సంభవించగా, అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించి వాటిని అదుపులోకి తెచ్చారని ఆయన తెలిపారు. ఈ ప్రమాదాలలో సుమారు రూ. 5.08 కోట్ల ఆస్తి నష్టం సంభవించినప్పటికీ, సుమారు రూ. 5.09 కోట్ల విలువైన ఆస్తిని రక్షించడంతో పాటు 63 మంది ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించాలని , అలాగే ప్రమాద ప్రాంతానికి అనవసరంగా చేరకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో అగ్నిమాపక సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఈ వారోత్సవాన్ని విజయవంతం చేయడానికి జిల్లా ప్రజలందరూ సహకరించవలసిందిగా జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి బి. నాగేశ్వరరావు కోరారు.

Tags: