బీఆర్‌ఎస్ కార్యాలయం కూల్చివేత.. కక్ష సాధింపు చర్యే
- ఆదర్శ్ రెడ్డి
విశ్వంభర, సంగారెడ్డి : అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ గ్రామంలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయం, పలువురు నాయకుల భవనాలను ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేయడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఐలాపూర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సర్వే నంబర్ 148లోని 36 గుంటల భూమి తమ పూర్వీకుల నుంచి వస్తున్న పట్టా భూమి అని తెలిపారు. భూభారతి రికార్డుల్లో కూడా పట్టా నమోదై ఉన్నప్పటికీ, హైడ్రా అధికారులు నిబంధనలకు విరుద్ధంగా బీఆర్‌ఎస్ నాయకుడు మాణిక్ యాదవ్ భవనాన్ని కూల్చివేశారని ఆరోపించారు. రెండో శనివారం సెలవు దినమని తెలిసి కూడా సుమారు 2000 మంది పోలీసు బలగాలతో వచ్చి కూల్చివేతలు జరపడం ప్రజలను భయాందోళనలకు గురిచేసిందని అన్నారు. ఇది ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని మండిపడ్డారు.అదే సర్వే నంబర్‌లో ఉన్న ఇతర భవనాలను వదిలేసి కేవలం బీఆర్‌ఎస్ నాయకుల భవనాలనే లక్ష్యంగా చేసుకుని కూల్చివేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. కూల్చివేతల సమయంలో భవనాల్లో ఉన్న అద్దెదారులకు కనీస సమయం కూడా ఇవ్వలేదని, మాణిక్ యాదవ్‌కు చెందిన నూతన కారు, ఆర్వో ప్లాంట్‌ను ధ్వంసం చేయడంతో భారీ నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏదైనా చర్యకు ముందు కనీసం 15 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఎలాంటి నోటీసులు లేకుండానే చర్యలు చేపట్టారు. ప్రభుత్వం పేదలు, సామాన్యులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. అమీన్‌పూర్ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ రంగం తీవ్రంగా దెబ్బతింటోంది అని ఆయన అన్నారు. బీఆర్‌ఎస్ నాయకులపై జరుగుతున్న కక్షసాధింపు చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని, లేదంటే ప్రజా ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మాణిక్ యాదవ్ భవనం కూల్చివేతపై హైకోర్టులో న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



