మిర్యాలగూడ లో ఘనంగా అంబేద్కర్ జయంతి
విశ్వంభర, మిర్యాలగూడ: మిర్యాలగూడ పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో అన్ని కుల సంఘాలు, రాజకీయ పార్టీలు, దళిత సంఘాలతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా, ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి రాజీవ్ భవన్ లో అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అన్ని కుల సంఘాల, రాజకీయ పార్టీల నాయకులతో కలిసి రాజీవ్ చౌక్ నుంచి బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి,అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం నాయకులు, సంఘాల నాయకులతో కలిసి ప్రాంగణంలో న్యాయ భోజ్ - సహ పంక్తి భోజనాలు చేశారు. అనంతరం బి ఎల్ ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో ఉచిత రక్త దాన శిబిరం నిర్వహించారు. అనంతరం ఉచిత పెరుగన్నం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎల్ఆర్ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా వారికి మీ అందరితో కలిసి ఇలా ఘనంగా నివాళులు అర్పించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. బాబాసాహెబ్ అందించిన రాజ్యాంగం వల్లే నేడు మనమందరం సమాన హక్కులతో జీవిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ రాజ్యాంగ విలువలను కాపాడటంలో ముందుంటుంది. దళితులు, గిరిజనులు మరియు వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ గారు చేసిన పోరాటం మరువలేనిది. ఆయన బాటలోనే నడుస్తూ, ప్రజా ప్రభుత్వం పరిపాలన కొనసాగిస్తుంది అని అన్నారు. చదువుకో, వ్యవస్థీకృతం అవ్వు, పోరాడు అన్న బాబాసాహెబ్ పిలుపును మన యువత ఆదర్శంగా తీసుకోవాలి. పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి... అందులో భాగంగా ప్రజా ప్రభుత్వం రాష్టంలో విద్యకు పెద్ద పీఠ వేస్తుంది అని అన్నారు. ప్రజా పాలనలో భాగంగా అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా ఇందిరమ్మ ఇళ్లు మరియు, సన్నబియ్యం, ఇతర సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాడికి చేరేలా మా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది అన్నారు. చివరగా, దేశంలో ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలన్నా, సామాజిక అసమానతలు తొలగిపోవాలన్నా అంబేద్కర్ గారి సిద్ధాంతాలే మనకు మార్గదర్శకాలు. ఆయన ఆశయ సాధనలో మనమందరం భాగస్వాములం అవుదామని పిలుపునిచ్చారు... ఇలాగే మన మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా కుల, రాజకీయ పార్టీలకి అతీతంగా అందరం ఐకమత్యం తో భాగస్వాములు అవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మిరియాల మున్సిపల్ చైర్మన్ చిలుకూరు సుధా బాలకృష్ణ మరియు వైస్ చైర్మన్ గుడిపాటి శిరీష నవీన్, మిర్యాలగూడ నియోజకవర్గ అన్ని కుల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, దళిత సంఘాల నాయకులు, అంబేద్కర్ గారి అభిమానులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు , కార్యకర్తలు, బి ఎల్ ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.



