అంబేద్కర్ చూపిన మార్గం అందరికీ ఆదర్శం
- టిజిఐఐసి చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి
విశ్వంభర, హైదరాబాద్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి సందర్భంగా జిల్లాలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు తదితరులు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన జయంతి కార్యక్రమంలో పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ దూరదృష్టి వల్లే భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించేందుకు ఆయన చేసిన కృషి రస్మరణీయమని అన్నారు. విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, విద్యార్థులు కృషి చేసి జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగాలని సూచించారు. యువత అంబేద్కర్ చూపిన మార్గంలో నడుచుకుని రాజ్యాంగ విలువలను ఆచరణలో పెట్టాలని, సమ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ రూపకర్తగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన మహానుభావుడిగా చిరస్మరణీయుడని అన్నారు. భారత రాజ్యాంగం గొప్పదని, యువత చదువుపై దృష్టి సారిస్తూ సమాజంలో మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. ధైర్యం, నమ్మకం తో ముందుకు సాగితే వారి భవిష్యత్తు మాత్రమే కాక దేశ ప్రగతికి కూడా తోడ్పడుతుందని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలు సమానత్వం, విద్య, స్వాభిమానం అనే విలువలపై ఆధారపడి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఆ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజాభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, సాంస్కృతిక సారథి కళాకారుల పాటలు ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ వనిత సంతోష్, అదనపు కలెక్టర్ పాండు, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు,వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, యువత, విద్యార్థులు, ప్రజలు పాల్గొన్నారు.



