వికసిత్ భారత్.. వికసిత్ కేరళతోనే సాధ్యం: అమిత్ షా
ఆదివారం తిరువనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల బీజేపీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర సదస్సులో అమిత్ షా పాల్గొని.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం "మిషన్ 2026"ను అధికారికంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రారంభించారు.
విశ్వంభర నేషనల్ బ్యూరో: 'వికసిత్ భారత్' (అభివృద్ధి చెందిన భారతదేశం) సాధించాలంటే అది 'వికసిత్ కేరళ'తోనే సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఆదివారం తిరువనంతపురంలో జరిగిన స్థానిక సంస్థల బీజేపీ ప్రజాప్రతినిధుల రాష్ట్ర సదస్సులో అమిత్ షా పాల్గొని.. రాబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం "మిషన్ 2026"ను అధికారికంగా ప్రారంభించారు. త్వరలో బీజేపీకి చెందిన నేత కేరళ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి తిరువనంతపురం కీలక మైలురాయని అభివర్ణించారు. కేరళలో సమగ్ర అభివృద్ధి జరగాలంటే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలని ఆయన ఆకాంక్షించారు.
శబరిమల ఆలయానికి సంబంధించిన బంగారు ఆభరణాల వివాదంపై అమిత్ షా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ కేసులో ఇద్దరు మంత్రులు ప్రజల దృష్టిలో దోషులుగా ఉన్నారని, వారి ఆధ్వర్యంలో నిష్పక్షపాత విచారణ సాధ్యం కాదని అన్నారు. "శబరిమల ఆస్తులను కాపాడలేని వారు, మన నమ్మకాలను కాపాడలేరు" అని వ్యాఖ్యానించారు. ఈ అంశంపై దేశమంతా ఆందోళనతో ఉందని చెప్పారు. కేరళ ఆర్థిక వ్యవస్థ కేవలం విదేశీ నిధులపైనే ఆధారపడకూడదని, ఇక్కడ సమగ్ర అభివృద్ధి జరగాలని అమిత్ షా సూచించారు. ప్రధాని మోదీ దేశంలో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను కల్పించారని, అటువంటి సమతుల్య అభివృద్ధి నమూనా కేరళకు అవసరమని పేర్కొన్నారు.



