తొలిరోజు ముగిసిన విజయ్ సీబీఐ విచారణ
తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సోమవారం సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు, సినీ నటుడు విజయ్ సోమవారం సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. సుమారు ఆరు గంటల పాటు సాగిన ఈ విచారణలో అధికారులు విజయ్‌ను పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు.
విచారణ సందర్భంగా తొక్కిసలాట ఘటనకు, తన పార్టీకి ఎలాంటి సంబంధం లేదని విజయ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. తొక్కిసలాట జరిగిన సమయంలో పరిస్థితి చేయి దాటిపోకూడదన్న ఉద్దేశంతోనే తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. పార్టీ పరంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఆయన అధికారులకు వివరించినట్లు సమాచారం. గతంలో పార్టీ కార్యకర్తలను ప్రశ్నించినప్పుడు కూడా వారు ఇదే తరహా సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం. తొలిరోజు విచారణ ముగిసినప్పటికీ, విజయ్ నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని సీబీఐ వర్గాలు తెలిపాయి. అయితే, పండగ నేపథ్యంలో విచారణకు విరామం ఇవ్వాలని విజయ్ కోరడంతో.. పండగ ముగిసిన తర్వాత ఆయన్ను మరోసారి ప్రశ్నించనున్నారు.
అసలేం జరిగింది?
గతేడాది సెప్టెంబరు 27న కరూర్‌లో విజయ్ నిర్వహించిన ప్రచార సభలో భారీ ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. విజయ్ నిర్ణీత సమయం కంటే ఆలస్యంగా రావడం వల్లే అభిమానులు ఒక్కసారిగా మీదకు రావడంతో తొక్కిసలాట జరిగిందని తమిళనాడు పోలీసులు పేర్కొన్నారు. ఇదంతా డీఎంకే ప్రభుత్వం చేస్తున్న కుట్ర అని, తనను రాజకీయంగా దెబ్బతీయడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విజయ్ గతంలోనే కొట్టిపారేశారు.



