చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ క్రికెట్ మ్యాచ్‌లు
ఐపీఎల్, అంతర్జాతీయ మ్యాచ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సర్కారు
బెంగళూరు క్రికెట్ ప్రేమికులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరంలోని ప్రఖ్యాత ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది.
విశ్వంభర, స్పోర్ట్స్ బ్యూరో: బెంగళూరు క్రికెట్ ప్రేమికులకు కర్ణాటక ప్రభుత్వం తీపి కబురు అందించింది. నగరంలోని ప్రఖ్యాత ఎం.చిన్నస్వామి స్టేడియంలో ఐపీఎల్‌తో పాటు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించుకునేందుకు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించింది. గతంలో జరిగిన అవాంఛనీయ సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఈసారి ప్రభుత్వం అత్యంత కఠినమైన నిబంధనలను విధించింది.
స్టేడియం లోపల, వెలుపల భద్రతను పర్యవేక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రేక్షకుల నియంత్రణకు సంబంధించి కచ్చితమైన ప్రోటోకాల్స్ పాటించాలని షరతు విధించింది. ఈ నిబంధనలకు అనుగుణంగానే మ్యాచ్‌లు నిర్వహించాల్సి ఉంటుందని కేఎస్‌సీఏ స్పష్టం చేసింది.
ఆ చేదు జ్ఞాపకం..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తొలిసారి ఐపీఎల్ విజేతగా నిలిచిన తరుణంలో నగరంలో అంబరాన్నంటేలా సంబరాలు జరిగాయి. అయితే, స్టేడియం వెలుపల జరిగిన భారీ తోపులాటలో 11 మంది ప్రాణాలు కోల్పోవడంతో ప్రభుత్వం అప్పట్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. భద్రతా లోపాలను ఎత్తిచూపుతూ అప్పటి నుంచి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణపై నిషేధం విధించింది. నిషేధం ఎత్తివేతతో రాబోయే ఐపీఎల్ సీజన్ మ్యాచ్‌లు మళ్లీ తమ సొంత మైదానంలో జరుగుతాయని తెలియడంతో ఆర్సీబీ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



