కేరళ పేరు.. ఇక కేరళం
- కేంద్ర క్యాబినెట్ ఆమోదం
విశ్వంభర, నేషనల్ బ్యూరో: దేవుడి సొంత భూమిగా పిలిచే కేరళ పేరు మారనుంది. ఈ రాష్ట్రం పేరును అధికారికంగా కేరళం గా మార్చేదిశగా కీలక అడుగుపడింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పేరు మార్పుపై కేంద్రాన్ని అభ్యర్థిస్తూ ఇప్పటికే కేరళఅసెంబ్లీ పలుమార్లు తీర్మానాలు చేసిన సంగతి తెలిసిందే. అధికారిక రికార్డుల్లో రాష్ట్రం పేరును సవరించాలంటూ తీసుకువచ్చిన తీర్మానానికి ఇటీవల కేరళ శాసనసభ ఆమోదం తెలపగా.. తాజాగా కేంద్ర క్యాబినెట్ దానిని పరిగణనలోకి తీసుకుంది. ఈ ఏడాది కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఈ పరిణామాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.కేరళ పేరు మార్పుపై తొలిసారి 2023లో రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో ‘కేరళం’ అని పిలిచేవారని అప్పట్లో ముఖ్యమంత్రి పినరయి విజయన్ గుర్తు చేశారు. కానీ, ఇతర భాషల్లో మాత్రం కేరళ అని పిలుస్తున్నారని ఆయన తెలిపారు. కాగా.. ఈ విషయంలో విజయన్ ప్రభుత్వానికి బీజేపీ మద్దతు ఇచ్చింది. ఈ మేరకు ఇటీవల ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ సీఎంకు లేఖ రాశారు. దానికి ముఖ్యమంత్రి బదులిస్తూ.. ‘‘రాష్ట్రం అసలు పేరు కేరళం. కానీ బ్రిటిషర్లు తమ సౌకర్యం కోసం కేరళగా మార్చారు. వారు చేసిన మార్పులను రాష్ట్ర సంస్కృతికి అనుగుణంగా సరిదిద్దుతున్నాం’’ అని పేర్కొన్నారు.



