పట్టాలెక్కిన తొలి 'వందేభారత్‌ స్లీపర్‌' 

జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ

పట్టాలెక్కిన తొలి 'వందేభారత్‌ స్లీపర్‌' 

భారత రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలైంది. దేశీ సాంకేతికతతో రూపొందించిన అత్యంత విలాసవంతమైన తొలి ‘వందేభారత్‌ స్లీపర్‌’ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: భారత రైల్వే చరిత్రలో మరో నూతన అధ్యాయం మొదలైంది. దేశీ సాంకేతికతతో రూపొందించిన అత్యంత విలాసవంతమైన తొలి ‘వందేభారత్‌ స్లీపర్‌’ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో జరిగిన ఘనమైన కార్యక్రమంలో ఆయన జెండా ఊపి ఈ రైలును పట్టాలెక్కించారు. ఈ రైలు పశ్చిమ బెంగాల్‌లోని హావ్‌డా - అస్సాంలోని గువాహటి (కామాఖ్య) మధ్య ప్రయాణికులకు సేవలు అందించనుంది.

విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని రైలును ప్రారంభించడానికి ముందు ప్రధాని మోదీ స్వయంగా కోచ్‌లలోకి వెళ్లి పరిశీలించారు. అందులోని అత్యాధునిక సౌకర్యాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైల్లో ఉన్న విద్యార్థులతో ప్రధాని సరదాగా ముచ్చటించారు. విమాన ప్రయాణానికి మించిన సౌకర్యాలు ఈ రైల్లో ఉన్నాయని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.

Read More 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌..సీఎం రేవంత్ భారీ సన్నాహాలు !

గంటకు 180 కి.మీ. వేగం వందేభారత్‌ స్లీపర్‌ రైలు రికార్డు స్థాయి వేగాన్ని సాధించింది. రాజస్థాన్‌లోని కోటా నుంచి మధ్యప్రదేశ్‌లోని నాగ్దా మధ్య నిర్వహించిన తుది పరీక్షల్లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ఠ వేగాన్ని అందుకుంది. రైలు ఇంత వేగంతో వెళ్తున్నా ప్రయాణికులకు కుదుపులు తెలియకుండా ఉండేలా అధునాతన సస్పెన్షన్‌ వ్యవస్థను రూపొందించారు. గతంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ పంచుకున్న వీడియోలో.. గరిష్ఠ వేగం వద్ద కూడా నీటి గ్లాసులోని నీళ్లు ఏమాత్రం తొణకకపోవడం ఈ రైలు స్థిరత్వానికి నిదర్శనంగా నిలిచింది.

విమాన తరహా సౌకర్యాలు.. 
మొత్తం 16 కోచ్‌లతో సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా కనీస ఛార్జీని రూ.960గా నిర్ణయించారు.ఆకర్షణీయమైన ఏసీ బెర్తులు, మెరుగైన కుషనింగ్, నిప్పును గుర్తించే ఫైర్ డిటెక్షన్ సిస్టమ్, సీసీటీవీ నిఘా, ఆటోమేటిక్ తలుపులు వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైల్లో ఆర్‌ఏసీ (RAC) లేదా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులను అనుమతించరు. కన్ఫర్మ్ టికెట్ ఉన్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది. సుదూర ప్రాంతాలకు వేగంగా, సౌకర్యవంతంగా చేరుకోవాలనుకునే ప్రయాణికులకు ఈ వందేభారత్‌ స్లీపర్‌ ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా మారనుంది