తమిళమే మా ఊపిరి: సీఎం స్టాలిన్

తమిళమే మా ఊపిరి: సీఎం స్టాలిన్

తమిళనాడు గడ్డపై హిందీ ఆధిపత్యానికి తావులేదు.. తమపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: తమిళనాడు గడ్డపై హిందీ ఆధిపత్యానికి తావులేదు.. తమపై బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరించారు. ఆదివారం నిర్వహించిన 'తమిళ భాషా అమరవీరుల దినోత్సవం' సందర్భంగా కేంద్రం అనుసరిస్తున్న త్రిభాషా విధానంపై స్టాలిన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తమిళ భాషా పరిరక్షణ కోసం 1965లో జరిగిన చారిత్రాత్మక పోరాటాన్ని స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. హిందీని అధికారిక భాషగా మార్చాలన్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆనాడు తమిళనాడులో పెల్లుబికిన ఆగ్రహం, ఆ ఆందోళనల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల త్యాగాలను కొనియాడారు. ఈ సందర్భంగా 1965 నిరసనలకు సంబంధించిన ఒక భావోద్వేగపూరిత వీడియోను స్టాలిన్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

నిధుల నిలిపివేతపై ధ్వజం
జాతీయ విద్యా విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదన్న సాకుతో, కేంద్ర ప్రభుత్వం తమిళనాడుకు రావాల్సిన నిధులను కావాలనే నిలిపివేస్తోందని ముఖ్యమంత్రి స్టాలిన్ ఆరోపించారు. రాష్ట్రానికి రావాల్సిన హక్కులను నిలిపివేసి మమ్మల్ని లొంగదీసుకోవాలని చూస్తున్నారన్నారు. కానీ తమిళ భాషా గౌరవం ముందు ఈ నిధులు తమకు ముఖ్యం కాదని చెప్పారు. ఏ శక్తి కూడా తమపై హిందీని రుద్దలేదని స్టాలిన్ స్పష్టం చేశారు.

Read More ISRO Space Mission: PSLV-C62కు శ్రీవారి ఆశీస్సులు.. 2026లో ఇస్రో తొలి మిషన్‌కు తిరుమలలో పూజలు..!!

1965 ఉద్యమం
హిందీని ఏకైక అధికారిక భాషగా చేయాలన్న కేంద్ర నిర్ణయంపై తమిళనాడులో 1965లో భారీ హింసాత్మక నిరసనలు జరిగాయి. దీనివల్ల అప్పటి ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సి వచ్చింది. భాషా ఉద్యమంలో అశువులు బాసిన వారి స్మారకార్థం గతేడాది నుంచి జనవరి 25ను 'తమిళ భాషా అమరవీరుల దినోత్సవం'గా ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.  త్రిభాషా విధానం పేరుతో హిందీని పాఠశాలల్లో ప్రవేశపెట్టడంపై స్టాలిన్ ప్రభుత్వం మొదటి నుంచీ విముఖంగా ఉంది.