మావోయిస్టులకు షాక్.. 9 మంది మావోల లొంగుబాటు

 మావోయిస్టులకు షాక్.. 9 మంది మావోల లొంగుబాటు

దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు కేడర్ నుంచి మరో తొమ్మిది మంది కీలక నేతలు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.

విశ్వంభర, నేషనల్ బ్యూరో: దండకారణ్యంలో మావోయిస్టు పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. గత కొంతకాలంగా వరుస ఎన్‌కౌంటర్లు, లొంగుబాట్లతో బలహీనపడుతున్న మావోయిస్టు కేడర్ నుంచి మరో తొమ్మిది మంది కీలక నేతలు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని ధంతారి జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సమక్షంలో వారు తమ ఆయుధాలను అప్పగించి జనజీవన స్రవంతిలో కలిశారు. లొంగిపోయిన ఈ తొమ్మిది మంది మావోయిస్టులపై ప్రభుత్వం గతంలోనే భారీ రివార్డులను ప్రకటించింది. వీరిందరిపై కలిపి మొత్తం రూ.47 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరు గతంలో పలు హింసాత్మక ఘటనలు, ఐఈడీ పేలుళ్లు, భద్రతా దళాలపై దాడుల్లో పాల్గొన్నట్లు ప్రాథమిక సమాచారం.

ప్రభుత్వ పునరావాస కార్యక్రమాలపై నమ్మకంతోనే ఈ మావోయిస్టులు బయటకు వచ్చినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరపున అందాల్సిన తక్షణ సాయం, ఉపాధి అవకాశాలను కల్పిస్తామని జిల్లా యంత్రాంగం హామీ ఇచ్చింది. "నక్సలిజం వల్ల ఒరిగేదేమీ లేదని, అడవుల్లో ప్రాణాలు పణంగా పెట్టే కంటే సామాన్య పౌరులుగా జీవించడం మిన్న అని గుర్తించాలి. ఇంకా అడవుల్లోనే ఉండిపోయిన మావోయిస్టులు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని లొంగిపోవాలి" అని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. వరుస లొంగుబాట్లతో ధంతారి, బస్తర్ ప్రాంతాల్లో మావోయిస్టు ఉద్యమ ప్రాబల్యం గణనీయంగా తగ్గుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read More రాహుల్ పర్యటన.. డీకే ఇంట్రెస్టింగ్ పోస్ట్..!!