పేదల సొంతింటి కల సాకారమే కాంగ్రెస్ లక్ష్యం
- ఎమ్మెల్యే బాలునాయక్
విశ్వంభర, చింతపల్లి:అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్ పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని గోవిందు సువర్ణ-జ్ఞానేశ్వర్ దంపతులు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి పాల్గొని యజమానులతో గృహ ప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ది, సంక్షేమ పథకాలను నిరుపేదలకు, అర్హులందరికీ అందజేస్తామన్నారు. పేదల ఆత్మగౌరవ పరిరక్షణే ప్రభుత్వ ధ్యేయమని అర్హులందరికీ దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. పల్లెలైనా, పట్టణాలైనా ప్రజాపాలనే ప్రగతి మార్గం అన్నారు. ప్రతి ఇంటికి చేరుతున్న సంక్షేమం, ప్రతి వీధిలో జరుగుతున్న అభివృద్ధే అందుకు సాక్ష్యం అన్నారు. ఈ సందర్భంగా గృహప్రవేశం చేసిన గోవిందు సువర్ణ-జ్ఞానేశ్వర్ దంపతులను ఎమ్మెల్యే బాలునాయక్ అభినందించి, శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు గౌరవప్రదమైన జీవనం కల్పించేందుకు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపే ఈ పథకం ద్వారా అనేక కుటుంబాల సొంతింటి కల సాకారం అవుతుందని తెలిపారు. కొత్త ఇంటిలో లబ్ధిదారులు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంగిరేకుల నాగభూషణం, చింతపల్లి సర్పంచ్ కాసారపు శ్వేతా శ్రీనివాస్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ముచర్ల యాదగిరి, లింగంపల్లి వెంకటయ్య, ఉజ్జిని నరేందర్ రావు, గోవిందు రవికుమార్, ఎండి సిద్దిక్ బాబా, ఎల్లంకి రాధా కిషన్, గుణమోని కొండల్, పంబలి వెంకటయ్య, ఆదిరాల కృష్ణయ్య, దాసరి రాజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



