హైడ్రా కూల్చివేతలు అన్యాయం: నారాయణ
విశ్వంభర, బాచుపల్లి : బాచుపల్లి ప్రణీత్ అంటిలియా కాలనీలో జరిగిన హైడ్రా కూల్చివేతలు చట్టానికి విరుద్ధమని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ అన్నారు. కోర్టులో స్టే ఉన్నప్పటికీ గ్రీన్ బెల్ట్ ప్రాంతాల్లో ముందస్తు అనుమతి లేకుండా చర్యలు తీసుకోవడం సరికాదన్నారు. బాచుపల్లిలోని కాలనీని సందర్శించి హైడ్రా చర్యలను నిరసించారు.చెరువులు, ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు హైడ్రా ఏర్పాటు చేయడాన్ని సిపిఐ స్వాగతించిందని, కానీ ఇటువంటి చర్యల వల్ల సంస్థపై ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉందన్నారు. హైడ్రా చర్యల వెనుక రాజకీయ ఒత్తిడులు, రియల్ ఎస్టేట్ ప్రభావం ఉన్నట్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కాలనీ వాసులకు సిపిఐ అండగా ఉంటుందని, వారి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి ఉమామహేష్, మండల కార్యదర్శి స్వామి, కాలనీ అధ్యక్షుడు రాజిరెడ్డి, కార్యదర్శి వెంకట్ రమణ, సహాయ కార్యదర్శి దస్తగిరి, కోశాధికారి సదానంద్, నాయకులు కృష్ణ, నర్సింహారెడ్డి, సహదేవరెడ్డి, శ్రీనివాస్ చారి, భీమేష్, కాలనీ వాసులు కవిత, మైత్రి, కుమార్ వంశీ తదితరులు పాల్గొన్నారు.



