నటి ప్రత్యూష మృతి కేసులో సిద్ధార్థరెడ్డికి చుక్కెదురు
రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన జైలుశిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. నిందితుడికి గతంలో హైకోర్టు ఖరారు చేసిన శిక్షను సమర్థించిన సుప్రీం ధర్మాసనం.. సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
పోస్టుమార్టం ప్రక్రియపై సుప్రీం తీవ్ర అసంతృప్తి
ఈ కేసు విచారణ సందర్భంగా పోస్టుమార్టం జరిగిన తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పోస్టుమార్టం నిర్వహించిన పద్ధతి సరిగా లేదని అభిప్రాయపడింది. నిందితుడు, బాధితురాలి తరఫున దాఖలైన వేర్వేరు అప్పీళ్లను పరిశీలించిన అనంతరం ఈ మేరకు తీర్పును వెలువరించింది.
ప్రేమ.. విషాదం.. సుదీర్ఘ న్యాయపోరాటం
ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి హైదరాబాద్‌లో ఇంటర్ చదువుతున్నప్పుడు ప్రేమించుకున్నారు. ప్రత్యూష సినిమాల్లోకి వెళ్లగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్‌లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న ఇద్దరూ విషం తాగిన స్థితిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష ఫిబ్రవరి 24న మృతి చెందగా, చికిత్స అనంతరం సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జి అయ్యాడు. కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు పరీక్షల్లో తేలింది. ముగ్గురు వైద్యుల బృందం నివేదిక ప్రకారం.. ఆర్గానోఫాస్ఫేట్ కారణంగా ప్రత్యూష మరణించారని, మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని తేలింది.
ఐదేళ్ల నుంచి రెండేళ్లకు శిక్ష తగ్గింపు
దర్యాప్తు జరిపిన సీబీఐ.. నిందితుడిపై ఆత్మహత్యకు పురికొల్పడం (సెక్షన్ 306), ఆత్మహత్యకు యత్నించడం (సెక్షన్ 309) కింద ఛార్జిషీట్ దాఖలు చేసింది. 2004 ఫిబ్రవరి 23న హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగారశిక్ష, రూ.5 వేలు జరిమానా విధించారు. దీనిని సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50 వేలకు పెంచుతూ 2011 డిసెంబరు 28న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి, ప్రత్యూష తల్లి సరోజినీదేవి 2012లో సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేయగా, తాజాగా సర్వోన్నత న్యాయస్థానం తుది తీర్పు ఇచ్చింది.



