మెటాకు సుప్రీంకోర్టు వార్నింగ్
వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంలో టెక్ దిగ్గజం మెటాకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. భారతీయ పౌరుల సమాచార భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: వాట్సాప్ ప్రైవసీ పాలసీ వ్యవహారంలో టెక్ దిగ్గజం మెటాకు దేశ అత్యున్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. భారతీయ పౌరుల సమాచార భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం మెటా తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. "మీరు మా దేశ గోప్యతతో ఆడుకోవాలని చూస్తే సహించం. మా డేటాలోని ఒక్క అంకెను కూడా ఇతరులతో పంచుకోవడానికి అనుమతించం" అని హెచ్చరించారు. భారతదేశ చట్టాలకు లోబడి పని చేయడం ఇష్టం లేని పక్షంలో.. ఇక్కడి నుంచి నిష్క్రమించవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు.
డేటా దోపిడీపై సొలిసిటర్ జనరల్ వాదన
ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాట్సాప్ వైఖరిని కోర్టు దృష్టికి తెచ్చారు. తమ వ్యాపార లాభాల కోసం వాట్సాప్ యూజర్ల డేటాను మెటాతో పంచుకుంటోందని వివరించారు. వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని ఇలా తరలించడం ముమ్మాటికీ దోపిడీ కిందకే వస్తుందని వాదించారు. మెటా విధానాలు ఎంత క్లిష్టంగా ఉన్నాయో వివరిస్తూ సీజేఐ తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. ఒక వైద్యుడు తనకు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే, వెంటనే దానికి సంబంధించిన ప్రకటనలే తన ఫోన్‌లో ప్రత్యక్షమయ్యాయని గుర్తు చేశారు. ఉన్నత చదువులు చదివిన వారికే ఈ విధానాలు అర్థం కానప్పుడు.. దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువు రాని ప్రజలు వీటిని ఎలా గ్రహిస్తారని ప్రశ్నించారు.
ప్రైవసీ పాలసీ వివాదం?
యూజర్ల భద్రతే తమ లక్ష్యమని వాట్సాప్ చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. తొలుత డేటా షేరింగ్‌ను తిరస్కరించిన వాట్సాప్, ఆ తర్వాత వినియోగదారుల అనుభవాలను ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నట్లు ఒప్పుకుంది. కొత్త పాలసీ ప్రధానంగా వ్యాపార ఖాతాల కోసమేనని సంస్థ వాదిస్తోంది. వ్యక్తిగత మెసేజ్‌లు, కాల్స్‌ను తాము చూడలేమని, అవి 'ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్' అని వాట్సాప్ స్పష్టం చేస్తోంది.



