ఓడిపోయాక కోర్టును ప్రచార వేదికగా వాడుకుంటారా?
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. గతేడాది జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను రద్దు చేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం తీవ్రంగా స్పందించింది. ప్రజలు తిరస్కరించిన తర్వాత న్యాయస్థానాలను పాపులారిటీ కోసం వాడుకుంటున్నారా అని ధర్మాసనం నిలదీసింది.
అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్డీయే కూటమి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిందని జన్ సురాజ్ పార్టీ తన పిటిషన్‌లో ఆరోపించింది. ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన కింద ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత సుమారు 35 లక్షల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున పంపిణీ చేశారని పేర్కొంది. సుమారు రూ.15,600 కోట్ల మేర నిధులను ఎన్నికల ముందు పంచడం వల్ల ఓటర్లు ప్రభావితమయ్యారని, అందుకే ఎన్డీయే గెలుపును రద్దు చేయాలని కోరింది. ఈ పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
"ఎన్నికల్లో ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. ఇప్పుడు న్యాయస్థానాన్ని పాపులారిటీ కోసం వాడుకుంటున్నారా? అసలు మీ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయి? ఒకవేళ మీ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇలాంటి పథకాలనే అమలు చేసేవారు కదా!" అని సీజేఐ ప్రశ్నించారు. ఇలాంటి అంశాలపై రాజకీయ పార్టీలు కాకుండా సామాన్యులు కోర్టుకు వస్తే ఆహ్వానిస్తామని ధర్మాసనం పేర్కొంది. రాష్ట్ర స్థాయి ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు నేరుగా ఆదేశాలు ఇవ్వలేదని, ఏవైనా ఫిర్యాదులు ఉంటే పాట్నా హైకోర్టును ఆశ్రయించాలని సూచించింది. దీంతో జన్ సురాజ్ పార్టీ తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంది.



