దీదీని సాగనంపే సమయం వచ్చింది: ప్రధాని మోదీ

 దీదీని సాగనంపే సమయం వచ్చింది: ప్రధాని మోదీ

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ప్రజల కష్టాల పట్ల ఏమాత్రం స్పందన లేని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: పశ్చిమ బెంగాల్ ప్రజల కష్టాల పట్ల ఏమాత్రం స్పందన లేని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక వెళ్లిపోవాల్సిన సమయం వచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బెంగాల్ ప్రజలు ఈసారి స్పష్టమైన మార్పును కోరుకుంటున్నారని, ముఖ్యంగా యువతరం బీజేపీ అభివృద్ధి నమూనాపై నమ్మకం పెట్టుకుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు.

బృహన్ ముంబై ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం తొలిసారి పశ్చిమ బెంగాల్‌లోని మాల్దాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొన్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సభకు రాజకీయంగా ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. రాష్ట్రంలో వ్యాపిస్తున్న అవినీతి కారణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు పేదలకు చేరడం లేదని మోదీ ఆరోపించారు. పేదలకు ఇళ్లు, ఉచిత రేషన్‌తో పాటు కేంద్ర పథకాల లబ్ధి అందాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. కానీ పేదల కోసం పంపిన నిధులను టీఎంసీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వం తనకు మాత్రమే కాదు, బెంగాల్ ప్రజలకే శత్రువుగా మారిందని ఆయన విమర్శించారు.

Read More చెన్నైలో దివంగత ఎన్టీఆర్ నివాసానికి పూర్వవైభవం

బెంగాల్ అభివృద్ధితోనే 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనే లక్ష్యం సాకారమవుతుందని ప్రధాని స్పష్టం చేశారు. ఒడిశా, త్రిపుర, అస్సాం, బిహార్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ వరుస విజయాలను గుర్తుచేస్తూ, ఇప్పుడు బెంగాల్‌లో కూడా సుపరిపాలనకు మార్గం తెరవాల్సిన సమయం వచ్చిందన్నారు. మహారాష్ట్రలో, ముఖ్యంగా ముంబై పురపోరులో బీజేపీ సాధించిన చారిత్రక విజయాన్ని ప్రస్తావించారు. ఈసారి బెంగాల్‌లో మార్పు అవసరమని తాను చెబుతానని, అదే మాటను ప్రజలంతా గొంతెత్తి చెప్పాలని సభికులను మోదీ ఉత్సాహపరిచారు.

కేంద్ర ప్రభుత్వ పథకాలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అడ్డుకుంటోందని ప్రధాని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయుష్మాన్ భారత్ వంటి కీలక పథకాన్ని అడ్డుకున్న ఏకైక రాష్ట్రం బెంగాల్ అని, దీనివల్ల పేద ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. ఇలాంటి అమానవీయ ప్రభుత్వానికి గుడ్‌బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మాల్దాలో పరిశ్రమలు లేకపోవడంతో అక్కడి ప్రజలు, అలాగే ముర్షీదాబాద్ వాసులు ఉద్యోగాల కోసం వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం, వరదల సమయంలో సరైన సహాయం లేక తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు.

గంగా, ఫులాహార్ నదుల తీరాల్లో జరుగుతున్న భూక్షయం వల్ల వేలాది కుటుంబాలు ఇళ్లు కోల్పోయినా, రక్షణ గోడల కోసం ప్రజలు చేస్తున్న విజ్ఞప్తులను టీఎంసీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మోదీ ఆరోపించారు. కేంద్రం పంపిన వరద సహాయక నిధులు కూడా లబ్ధిదారులకు చేరలేదని కాగ్ నివేదికలు స్పష్టంగా చెబుతున్నాయని పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీఎంసీ అనుచిత విధానాలకు ముగింపు పలికి, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. అలాగే మాల్దా ప్రాంతంలోని మామిడి రైతులకు కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు కల్పించి, వారి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకుంటామని ప్రధాని స్పష్టం చేశారు.tmc

Tags: