ఆరెస్సెస్ ప్రతినిధులతో కమ్యూనిస్ట్ పార్టీ నేతల భేటీ..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో చైనా ప్రతినిధి బృందం ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: ఢిల్లీలో చైనా ప్రతినిధి బృందం ఆర్‌ఎస్‌ఎస్ నేతలతో సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ముందుగా ఆ బృందం బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించగా, అనంతరం నగరంలోని ప్రేరణ బ్లాక్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతినిధులతో భేటీ అయింది. షక్సాగామ్ లోయ అంశంపై చైనా–భారత్ మధ్య ఇప్పటికే మాటల యుద్ధం కొనసాగుతున్న తరుణంలో ఈ సమావేశం జరగడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ పరిణామంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, జాతీయ భద్రతకు సంబంధించిన సున్నిత అంశాలున్న సమయంలో చైనాతో ఇలాంటి సంప్రదింపులు సరికాదని స్పష్టం చేసింది.
ఆర్‌ఎస్‌ఎస్ వర్గాల సమాచారం ప్రకారం, చైనా ప్రతినిధి బృందం ఆర్‌ఎస్‌ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబలేతో సమావేశమైంది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అభ్యర్థన మేరకే ఈ భేటీ జరిగిందని, దాదాపు గంటపాటు చర్చలు కొనసాగినట్లు వెల్లడించారు. అయితే, ఈ సమావేశానికి ఎలాంటి నిర్దిష్ట అజెండా లేదని, ఇది పూర్తిగా మర్యాదపూర్వక సమావేశం మాత్రమేనని ఆర్‌ఎస్‌ఎస్ స్పష్టం చేసింది.
ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భగవత్ ప్రస్తుతం పర్యటనలో ఉండటంతో ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారని కూడా పేర్కొన్నారు. గత ఏడాది ఆగస్టులో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా పలు దేశాల ప్రతినిధులను ఆహ్వానించినప్పటికీ, పాకిస్థాన్, టర్కీ, చైనా దేశాల ప్రతినిధులను మాత్రం ఆహ్వానించలేదని ఆర్‌ఎస్‌ఎస్ వర్గాలు గుర్తుచేశాయి. ప్రస్తుత సమావేశాన్ని కూడా అదే క్రమంలో ఒక సాధారణ పరస్పర మర్యాద భేటీగా మాత్రమే చూడాలని అవి అభిప్రాయపడ్డాయి.



