మీలాంటి పక్షపాతిని చూడలేదు..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: బాలీవుడ్‌లో మతపరమైన పక్షపాతం ఉందంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో, ఈ వివాదంలోకి నటి, లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ కూడా చేరారు. రెహమాన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు
విశ్వంభర, నేషనల్ బ్యూరో: బాలీవుడ్‌లో మతపరమైన పక్షపాతం ఉందంటూ ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో, ఈ వివాదంలోకి నటి, లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్ కూడా చేరారు. రెహమాన్ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన ఒక ద్వేషపూరితమైన, పక్షపాత దృక్పథం కలిగిన వ్యక్తి అని ఆరోపిస్తూ, గతంలో తనను కలవడానికి కూడా ఆయన నిరాకరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇటీవల బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఆర్ రెహమాన్ మాట్లాడుతూ, గత ఎనిమిదేళ్ల కాలంలో హిందీ సినిమా పరిశ్రమలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుందని అన్నారు. ఆ మార్పు మతపరమైన కోణానికి సంబంధించినదై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ పరిణామాల వల్లే తనకు బాలీవుడ్‌లో అవకాశాలు తగ్గాయని, ఈ విషయం తనకు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా తెలిసిందని చెప్పారు. రెహమాన్ వ్యాఖ్యలపై ఇప్పటికే రచయిత్రి శోభా డే, గాయకుడు షాన్, కవి జావేద్ అఖ్తర్ వంటి ప్రముఖులు తమ అభిప్రాయాలు వెల్లడించగా, తాజాగా కంగనా రనౌత్ ఘాటుగా స్పందించారు.
ఈ అంశంపై కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. అందులో ఆమె, ప్రియమైన ఏఆర్ రెహమాన్ గారూ, నేను బీజేపీకి మద్దతు ఇస్తున్నాననే కారణంతో పరిశ్రమలో ఎన్నో రకాల వివక్షలు, పక్షపాతాలు ఎదుర్కొంటున్నాను. అయినప్పటికీ, మీలాంటి స్థాయిలో ద్వేషం, పక్షపాతం ప్రదర్శించే వ్యక్తిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
తాను దర్శకత్వం వహించిన ‘ఎమర్జెన్సీ’ చిత్రానికి సంగీతం అందించాలంటూ రెహమాన్‌ను సంప్రదించానని కంగనా తెలిపారు. అయితే ఆయన ఆ ప్రతిపాదనను పూర్తిగా తిరస్కరించారని ఆరోపించారు. నేను మీకు కథ వివరించాలనుకున్నాను. కానీ కథ వినడం సంగతి అటుంచి, నన్ను కలవడానికి కూడా మీరు ఒప్పుకోలేదు. ఆ చిత్రం ఒక వర్గానికి సంబంధించిన ప్రచార సినిమా అన్న భావనతో, అందులో భాగం కావడానికి మీరు ఇష్టపడలేదని నాకు అర్థమైంది” అని ఆమె పేర్కొన్నారు.
అయితే, తన ‘ఎమర్జెన్సీ’ సినిమాను విమర్శకులు ప్రశంసించారని, దాన్ని ఒక ‘మాస్టర్‌పీస్’గా అభివర్ణించారని కంగనా తెలిపారు. సమతుల్య దృక్పథంతో తెరకెక్కిన చిత్రమని ప్రతిపక్ష నేతలు కూడా మెచ్చుకున్నారని ఆమె చెప్పారు. అయినా మీరు ద్వేషంతో అంధులయ్యారు. మీ పరిస్థితి చూస్తే జాలిగా ఉంది అంటూ ఆమె తన పోస్ట్‌ను ముగించారు. కంగనా చేసిన ఈ వ్యక్తిగత ఆరోపణలు బాలీవుడ్‌లో ఇప్పటికే కొనసాగుతున్న పక్షపాతం, రాజకీయ ప్రభావాలపై చర్చను మరింత వేడెక్కించాయి. పరిశ్రమలో భావజాల భేదాలు, వ్యక్తిగత అభిప్రాయాలు అవకాశాలపై ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయన్న అంశంపై మళ్లీ తీవ్ర చర్చ మొదలైంది.



