సిరికి జెమిని ఏఐ పవర్..!!
విశ్వంభర, నేషనల్ బ్యూరో: టెక్ ప్రపంచంలో సంచలనంగా మారే కీలక ఒప్పందానికి ఆపిల్, గూగుల్ శ్రీకారం చుట్టాయి.
విశ్వంభర, నేషనల్ బ్యూరో: టెక్ ప్రపంచంలో సంచలనంగా మారే కీలక ఒప్పందానికి ఆపిల్, గూగుల్ శ్రీకారం చుట్టాయి. ఆపిల్ ఉత్పత్తుల్లో ప్రధాన పాత్ర పోషించే వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’తో పాటు ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’కు సంబంధించిన పలు అధునాతన ఫీచర్లలో ఇకపై గూగుల్ రూపొందించిన ‘జెమిని’ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని వినియోగించనున్నారు. ఈ మేరకు ఇరు దిగ్గజ సంస్థలు దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని అధికారికంగా ప్రకటించాయి.
ఆపిల్ స్వయంగా అభివృద్ధి చేస్తున్న ఫౌండేషన్ మోడల్స్ ఆశించిన స్థాయిలో పనితీరు చూపకపోవడం, అలాగే సిరి అప్‌డేట్ల విడుదలలో ఆలస్యం జరగడం ఈ నిర్ణయానికి ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. అందుబాటులో ఉన్న పలు ఏఐ టెక్నాలజీలను సమగ్రంగా పరిశీలించిన అనంతరం, తమ భవిష్యత్ అవసరాలకు గూగుల్ జెమిని మోడల్స్ అత్యంత బలమైన, విశ్వసనీయమైన పునాదిగా ఉంటాయని ఆపిల్ భావించినట్లు సమాచారం.
ఈ ఒప్పందంలో డేటా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి. యూజర్ల వ్యక్తిగత సమాచారాన్ని కాపాడే విషయంలో ఆపిల్ అనుసరిస్తున్న కఠినమైన ప్రైవసీ ప్రమాణాలకు అనుగుణంగానే డేటా ప్రాసెసింగ్ జరుగుతుందని తెలిపాయి. ఆన్-డివైస్ ప్రాసెసింగ్‌తో పాటు ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్ విధానంలోనే ఏఐ సేవలు పనిచేస్తాయని సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ భాగస్వామ్యంతో సిరి మరింత తెలివైనదిగా, యూజర్ అవసరాలకు అనుగుణంగా స్పందించే విధంగా రూపాంతరం చెందనుంది. ఈ ఏడాదిలోనే మెరుగైన సిరిని వినియోగదారులకు అందించాలనే లక్ష్యంతో ఆపిల్ పని చేస్తోంది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్‌లో విడుదలయ్యే ఐఓఎస్ 26.4 అప్‌డేట్‌తో కొత్త సిరి ఫీచర్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ ఒప్పందం వార్షికంగా సుమారు ఒక బిలియన్ డాలర్ల విలువ ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఆపిల్ డివైజ్‌లలో గూగుల్ సెర్చ్‌ను డిఫాల్ట్‌గా కొనసాగించేందుకు ఇరు కంపెనీల మధ్య భారీ ఒప్పందం కొనసాగుతుండగా, తాజా ఏఐ భాగస్వామ్యం ఈ రెండు టెక్ దిగ్గజాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయనుందని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.



