982 మంది పోలీసులకు పురస్కారాలు

982 మంది పోలీసులకు పురస్కారాలు

 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. 


విశ్వంభర, నేషనల్ బ్యూరో: 2026 గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రక్షణలో, శాంతిభద్రతల పరిరక్షణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసు, అగ్నిమాపక, హోంగార్డు మరియు కరెక్షనల్ సర్వీస్ సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది. దేశవ్యాప్తంగా మొత్తం 982 మంది సిబ్బంది ఈ గౌరవానికి ఎంపికయ్యారు. ప్రాణాలకు తెగించి పోరాడిన వారు కొందరైతే, దశాబ్దాల కాలంగా నిరుపమాన సేవలు అందించిన వారు మరికొందరు ఈ జాబితాలో నిలిచారు.

శత్రువులను ఎదుర్కోవడంలో, నేరస్తులను వేటాడడంలో ప్రాణాలను పణంగా పెట్టిన 125 మంది వీరులకు గ్యాలంట్రీ మెడల్స్ దక్కాయి. పోలీస్ విభాగం నుంచి 121 మంది, ఫైర్ సర్వీస్ నుంచి నలుగురు పతకాలు సాధించారు. జమ్మూ కశ్మీర్‌లో సాహసాలు చేసిన 45 మంది, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి 35 మంది ఈ జాబితాలో ఉండటం విశేషం. రాష్ట్రానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకట్ రెడ్డి తన అసాధారణ ధైర్యసాహసాలకు గానూ గ్యాలంట్రీ అవార్డుకు ఎంపికయ్యారు.

Read More 10 నిమిషాల డెలివరీకి బ్రేక్

విశిష్ట సేవలో 'తెలుగు' వెలుగు
దీర్ఘకాలికంగా విశిష్ట సేవలందించిన అధికారులకు ఇచ్చే 'ప్రెసిడెంట్ మెడల్స్' (101) లో తెలుగు అధికారులు మెరిశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఏఎస్పీ ఆర్.ఎం.కె. తిరుమలాచారి, తెలంగాణ నుంచి అడిషనల్ ఎస్పీ జీఎస్ ప్రకాశ్ రావు, ఎస్ఐ దామోదర్ రెడ్డి రాష్ట్రపతి పతకాలను అందుకోనున్నారు. మొత్తం 101 పతకాల్లో పోలీస్ సర్వీస్‌కు 89, అగ్నిమాపక దళానికి 5, హోంగార్డులకు 3, కరెక్షనల్ సర్వీస్‌కు 4 లభించాయి.

సేవే పరమావధిగా..
నిబద్ధతతో కూడిన సేవలకు ఇచ్చే మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ఈసారి 756 మందిని వరించాయి. ఇందులో పోలీస్ శాఖకు 664, ఫైర్  సర్వీస్ కు 34, సివిల్ డిఫెన్స్ & హోంగార్డుకు 33, కరెక్షనల్ సర్వీస్‌కు 25 పతకాలు ప్రదానం చేశారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో, మంచు పర్వతాల్లో, అటవీ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించే సిబ్బంది త్యాగాలను కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా కొనియాడింది. "ప్రజల రక్షణే లక్ష్యంగా పనిచేసే మన భద్రతా బలగాల పరాక్రమం దేశానికి గర్వకారణం" అని హోం మంత్రిత్వ శాఖ పేర్కొంది.