మార్షల్ ఆర్ట్స్‌లో అరుదైన ఘనత.. పవన్ కళ్యాణ్ సరికొత్త రికార్డ్..!!
విశ్వంభర నేషనల్ బ్యూరో: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తెలుగువారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టారు. మార్షల్ ఆర్ట్స్ రంగంలో ఆయన సాధించిన ఘనత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
విశ్వంభర నేషనల్ బ్యూరో: ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మరోసారి తెలుగువారి గర్వాన్ని ప్రపంచ వేదికపై నిలబెట్టారు. మార్షల్ ఆర్ట్స్ రంగంలో ఆయన సాధించిన ఘనత ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జపాన్‌కు చెందిన ప్రతిష్ఠాత్మకమైన ‘టకెడా షింగెన్ క్లాన్’లో ప్రవేశం పొందిన తొలి తెలుగు వ్యక్తిగా పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు. ఇది సాధారణ గుర్తింపు కాదు… శతాబ్దాల చరిత్ర కలిగిన జపనీస్ యుద్ధ సంప్రదాయాల్లోకి విదేశీయుడికి లభించే అరుదైన గౌరవం.
పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్‌లో ఉన్న అసాధారణ నైపుణ్యాన్ని గుర్తించిన అంతర్జాతీయ సంస్థ గోల్డెన్ డ్రాగన్స్ ఆయనకు ‘టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్’ అనే ప్రత్యేక బిరుదును ప్రదానం చేసింది. ఇది ఆయన యుద్ధ కళల పట్ల చూపిన నిరంతర సాధనకు దక్కిన గుర్తింపుగా చెప్పొచ్చు.
కెంజుట్సులో 5వ డాన్… అంతర్జాతీయ స్థాయి గుర్తింపు:
జపాన్‌కు చెందిన ప్రాచీన కత్తిసాము విద్య కెంజుట్సులో పవన్ కల్యాణ్‌కు 5వ డాన్ర్యాంక్ లభించింది. ఈ గౌరవాన్ని జపాన్‌కు చెందిన ‘సోగో బుడో కన్‌రి కై’ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు, జపాన్ వెలుపల అరుదుగా ఇచ్చే అవకాశం అయిన ‘సోకే మురమత్సు సెన్సై’ ఆధ్వర్యంలోని టకెడా షింగెన్ క్లాన్ సభ్యత్వం కూడా పవన్‌కు లభించింది. ప్రముఖ బుడో నిపుణుడు హాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్ధిక్ మహ్మూదీ మార్గదర్శకత్వంలో పవన్ కల్యాణ్ కెండోలో కూడా ఉన్నత స్థాయి శిక్షణ పొందారు. ఇది ఆయన యుద్ధ కళలపై ఉన్న నిబద్ధతను స్పష్టంగా చూపిస్తోంది.
చిన్నతనం నుంచే యుద్ధ కళలపై మక్కువ:
పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్ అంటే కేవలం హాబీ కాదు… అది జీవనశైలి. చిన్న వయసు నుంచే యుద్ధ కళలపై ఆసక్తి పెంచుకున్న ఆయన, దాదాపు మూడు దశాబ్దాలుగా క్రమశిక్షణతో సాధన చేస్తున్నారు. చెన్నైలో కఠిన శిక్షణ తీసుకోవడమే కాకుండా, జపనీస్ సమురాయ్ సంప్రదాయాలు, యుద్ధ తత్వాలపై లోతైన అధ్యయనం చేశారు. ఆయన నటించిన చిత్రాల్లో కనిపించే యుద్ధ సన్నివేశాలకు ఇదే ప్రాణం పోస్తోంది.
రాజకీయ బాధ్యతలు… సినీ ప్రయాణం:
ప్రస్తుతం పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూనే, సినీ రంగంలోనూ కొనసాగుతున్నారు. ఆయన నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగా, దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ కూడా రూపుదిద్దుకుంటోంది. రాజకీయాలు, సినిమాలు, యుద్ధ కళలు… మూడు రంగాల్లోనూ పవన్ చూపుతున్న అంకితభావం అభిమానులకు ప్రేరణగా నిలుస్తోంది.
అసలు కెంజుట్సు అంటే ఏమిటి?
కెంజుట్సు అనేది జపనీస్ భాషలో ‘కత్తి విద్య’ అని అర్థం. ఇది ఒక క్రీడ కాదు… సమురాయ్ యోధులు యుద్ధభూమిలో ప్రాణాల కోసం ఉపయోగించిన వాస్తవ పోరాట పద్ధతుల సమాహారం. జపాన్ సంప్రదాయ యుద్ధ విద్యలైన కో-బుడోలో ఇది అత్యంత కీలకమైన కళ.
కెంజుట్సుకు వందల ఏళ్ల చరిత్ర :
కెంజుట్సుకు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కమకురా కాలంలో ఇది విస్తృతంగా అభివృద్ధి చెందగా, మురోమాచి కాలంలో శిక్షణా పాఠశాలలు ఏర్పడ్డాయి. ఎడో కాలానికి వచ్చేసరికి వందల సంఖ్యలో స్కూల్స్ వెలిశాయి. సమురాయ్ వ్యవస్థ అంతరించిన తర్వాత కెంజుట్సు నుంచి ఆధునిక క్రీడ అయిన కెండో రూపుదిద్దుకుంది. ఈ కళలో ప్రధానంగా కటానా అనే పొడవాటి కత్తిని ఉపయోగిస్తారు. సాధన కోసం చెక్క కత్తి అయిన బోకెన్ వాడతారు. దాడి, ప్రతిదాడి, అడ్డుకోవడం వంటి పద్ధతులు ముందుగా నిర్ణయించిన కటా రూపంలో శిక్షణ ఇస్తారు. ఇది శారీరక బలం మాత్రమే కాదు… మానసిక నియంత్రణ, ఏకాగ్రత, ధైర్యం, గౌరవం వంటి బుషిడో సూత్రాలను కూడా నేర్పుతుంది. అటువంటి అరుదైన, గౌరవనీయమైన యుద్ధ కళలో పవన్ కల్యాణ్ ఉన్నత స్థాయికి చేరుకోవడం ఆయన పట్టుదలకే కాదు… తెలుగు సమాజానికి దక్కిన అంతర్జాతీయ గౌరవంగా చెప్పొచ్చు.



