అంతర్జాతీయ వేదికపై విశిష్ట వక్తగా కేటీఆర్

కొలంబియా బిజినెస్ స్కూల్ నుంచి ఆహ్వానం 

అంతర్జాతీయ వేదికపై విశిష్ట వక్తగా కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR)కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది.

విశ్వంభర, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (KTR)కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలోని ప్రతిష్టాత్మక కొలంబియా బిజినెస్ స్కూల్ (CBS) నిర్వహించే ‘21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్‌ (IBC)’లో ప్రసంగించాల్సిందిగా ఆయనకు ఆహ్వానం అందింది. 2026, ఏప్రిల్ 4న న్యూయార్క్ నగరంలో ఈ సదస్సు జరగనుంది. కొలంబియా యూనివర్సిటీకి చెందిన ‘సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్‌ (SABA)’ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గతంలో మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ తెలంగాణను ప్రపంచ పటంలో నిలిపిన తీరు, ఐటీ, పరిశ్రమల రంగంలో ఆయన చేసిన అసాధారణ కృషిని గుర్తిస్తూ ఈ ఆహ్వానం పంపినట్లు నిర్వాహకులు తెలిపారు. భారతదేశ వ్యాపారం, ఆవిష్కరణలు, విధాన నిర్ణయ రంగాలపై మేధోమథనం జరిగే ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక వేదికలలో ఈ కాన్ఫరెన్స్ ఒకటి.

ప్రముఖుల సమక్షంలో.. 
ఈ సదస్సులో ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ ‘జెరోధా’ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్  ప్రధాన వక్తగా పాల్గొననున్నారు. గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ సీఈఓ నికేశ్ అరోరా వంటి హేమాహేమీలు ఈ వేదికపై ప్రసంగించారు. ఇప్పుడు కేటీఆర్ తన ఆలోచనలను పంచుకోనుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More మెగా జాబ్ మేళా కు అపూర్వ స్పందన. -100 మంది అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసిన - బొల్ల శివశంకర్  

గ్లోబల్ లీడర్‌గా కేటీఆర్..
ఇటీవలే హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కూడా కేటీఆర్‌కు ఆహ్వానం అందిన విషయం తెలిసిందే. గతంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఆయన చేసిన ప్రసంగం అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. వరుసగా ప్రపంచ ప్రసిద్ధ విద్యాసంస్థల నుంచి ఆహ్వానాలు రావడం, కేటీఆర్ నాయకత్వం, విజన్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న గుర్తింపునకు నిదర్శనంగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాసేవలో ఆయన పాత్ర, భారతదేశ అభివృద్ధి పథంలో ఆయన పోషించిన క్రియాశీలక బాధ్యతను కొనియాడుతూ నిర్వాహకులు ఆయనను ‘విశిష్ట వక్త’గా ఆహ్వానించారు.

Tags: BRS Ktr