చైనాలో ఆగని జనాభా క్షీణత

చైనాలో ఆగని జనాభా క్షీణత

ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా దశాబ్దాల పాటు వెలిగిన చైనా, ఇప్పుడు వరుసగా నాలుగో ఏడాది కూడా జనాభా తగ్గుదలను నమోదు చేసింది.

విశ్వంభర బ్యూరో: ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా దశాబ్దాల పాటు వెలిగిన చైనా, ఇప్పుడు వరుసగా నాలుగో ఏడాది కూడా జనాభా తగ్గుదలను నమోదు చేసింది. 2025 చివరి నాటికి దేశ జనాభా 140.4 కోట్లుగా ఉన్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారిక గణాంకాలను విడుదల చేసింది. 2024తో పోలిస్తే ఏకంగా 30 లక్షల మంది తగ్గడం అక్కడి ఆర్థిక నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

పడిపోతున్న జననాల రేటు
గత ఏడాది చైనాలో కేవలం 79.2 లక్షల మంది మాత్రమే జన్మించారు. 2024 గణాంకాలతో పోలిస్తే ఇది 17 శాతం తక్కువ. ఆసియాలోని ఇతర పొరుగు దేశాలతో పోలిస్తే చైనాలో సంతానోత్పత్తి రేటు అత్యంత వేగంగా పడిపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చైనాలో జనాభా తగ్గడానికి ప్రధాన కారణం ఆకాశాన్నంటుతున్న జీవన వ్యయాలేనని సర్వేలు చెబుతున్నాయి. ఒక బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు చదువు, ఇతర అవసరాల కోసం సరాసరి 76 వేల డాలర్లు (సుమారు రూ. 69 లక్షలు) ఖర్చవుతోంది.  పెరిగిన ఖర్చుల దృష్ట్యా యువత పెళ్లిళ్లకు దూరంగా ఉంటున్నారు. వివాహమైన వారు కూడా పిల్లల్ని కనేందుకు సాహసించడం లేదు.

Read More తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ లో విజ్జి ఇంక్ ( యుఎస్ ఏ) , గ్రాన్యూల్స్ ఫార్మా ప్రతినిధులు పెట్టుబడులు 

ప్రభుత్వ కఠిన నిర్ణయాలు.. పన్ను మినహాయింపులు
ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు చైనా ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది. జనాభా పెంచడమే లక్ష్యంగా కొత్త పన్ను విధానాలను అమలు చేస్తోంది. కండోమ్స్ సహా ఇతర గర్భనిరోధక సాధనాలపై 13 శాతం విలువ ఆధారిత పన్ను (VAT) విధిస్తూ చట్టాన్ని సవరించింది. నర్సరీల నుంచి కిండర్ గార్టెన్స్ వరకు పిల్లల సంరక్షణ సేవలు, వృద్ధులు, వికలాంగుల సేవలతో పాటు వివాహ సంబంధిత సేవలపై జనవరి 1 నుంచే పన్ను మినహాయింపులు అమల్లోకి వచ్చాయి. జనాభాలో తగ్గుదల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, పని చేసే వారి సంఖ్య తగ్గి.. వృద్ధుల భారం పెరుగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.