WHOకు అమెరికా ‘గుడ్‌బై’
ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రంలో ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెన్నుముకగా నిలిచిన అమెరికా.. ఆ సంస్థ నుండి అధికారికంగా నిష్క్రమించింది.
విశ్వంభర బ్యూరో: ప్రపంచ ఆరోగ్య ముఖచిత్రంలో ఒక భారీ మార్పు చోటుచేసుకుంది. దశాబ్దాలుగా ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెన్నుముకగా నిలిచిన అమెరికా.. ఆ సంస్థ నుండి అధికారికంగా నిష్క్రమించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారం చేపట్టిన తొలిరోజే జారీ చేసిన కార్యనిర్వాహక ఆదేశం ప్రకారం, ఏడాది గడువు ముగియడంతో ఈ ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అమెరికా ఆరోగ్య శాఖ మంత్రి రాబర్ట్ ఎఫ్. కెనడీ జూనియర్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
కరోనా మహమ్మారిని అడ్డుకోవడంలో, ప్రపంచాన్ని అప్రమత్తం చేయడంలో WHO విఫలమైందని అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. WHO స్వతంత్రంగా కాకుండా, కొన్ని దేశాల రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని ఆరోపించింది. సంస్థలో పారదర్శకత కోసం అమెరికా సూచించిన కీలక సంస్కరణలను అమలు చేయడంలో WHO విముఖత చూపిందని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.
తక్షణమే అమల్లోకి వచ్చిన చర్యలు
అమెరికా కేవలం మాటలకే పరిమితం కాకుండా కఠిన నిర్ణయాలను అమలు చేస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు వెళ్లే అన్ని రకాల వార్షిక విరాళాలను, ప్రాజెక్ట్ నిధులను అమెరికా తక్షణమే నిలిపివేసింది. జెనీవా ప్రధాన కార్యాలయంలో మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న WHO ఆఫీసుల్లో పనిచేస్తున్న అమెరికా ప్రతినిధులు, టెక్నికల్ నిపుణులను వెనక్కి పిలిపించింది. టెక్నికల్ కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుండి అమెరికా శాశ్వతంగా తప్పుకుంది.
బ్లూమ్‌బెర్గ్ సంచలన నివేదిక
అమెరికా నిష్క్రమణ పక్కాగా ఉన్నా, ఆర్థిక లావాదేవీల విషయంలో వివాదం నెలకొంది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. నిష్క్రమించే సమయానికి అమెరికా WHOకు సుమారు 260 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 2,382 కోట్లు) బకాయి పడింది. నిబంధనల ప్రకారం బకాయిలు చెల్లిస్తేనే నిష్క్రమణ పూర్తయినట్లు భావిస్తామని సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. బకాయిలు చెల్లించే ప్రసక్తే లేదని, ఇప్పటికే అమెరికా భారీగా నష్టపోయిందని ట్రంప్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఇకపై కేవలం సాంకేతిక పరంగా, అత్యంత పరిమిత పరిధిలోనే ఆ సంస్థతో సంబంధాలు ఉంటాయని అమెరికా స్పష్టం చేసింది.
ప్రపంచంపై ప్రభావం ఏంటి?
WHO మొత్తం బడ్జెట్‌లో అమెరికా వాటా సుమారు 18% నుండి 20% వరకు ఉంటుంది. ఇప్పుడు ఈ నిధులు ఆగిపోవడంతో ఆఫ్రికా వంటి పేద దేశాల్లో సాగే పోలియో నిర్మూలన, టీకాల పంపిణీ, అత్యవసర వైద్య కార్యక్రమాలు కుంటుపడే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.



