లేబర్ కోడ్స్ కార్మికుల మెడకు ఉరితాళ్ళు

లేబర్ కోడ్స్ కార్మికుల మెడకు ఉరితాళ్ళు

విశ్వంభర, రామన్నపేట: కార్మికుల మెడలకు ఉరితాడులా మారిన లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని ఈ నెల 12న దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మిక లోకమంతా పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపునిచ్చారు. సమ్మె జయప్రదం కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో మండల స్థాయి సదస్సు నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లేశం మాట్లాడుతూ, దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కాలరాస్తూ మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తక్కువ వేతనంతో ఎక్కువ పని చేయించుకుని వారానికి 72 గంటల పనిని ముందుకు తీసుకొస్తూ హక్కులు అణిచివేస్తున్నారన్నారు. కార్మికులు హక్కుల పరిరక్షణ కోసం యాజమాన్యాల వేధింపులను అరికట్టడం కోసం యూనియన్ గా ఏర్పడే పరిస్థితి లేకుండా నూతన లేబర్ కోడ్స్ ఉన్నాయని, కార్మికుల హక్కుల్ని కాలరాస్తూ, కార్పొరేట్లకు ఎర్రతివాచీ పరిచే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక నియంతృత్వ పోకడపై సంఘటిత, అసంఘటిత కార్మికులు కలిసి  పోరాటానికి సన్నద్ధం కావాలని అన్నారు. అన్ని రంగాల కార్మికులు 12న జరిగే సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు బొడ్డుపల్లి వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నకిరేకంటి రాము, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బందెల బిక్షం, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వంగాల మారయ్య, ట్రాన్స్ పోర్ట్ యూనియన్ మండల గౌరవ అధ్యక్షుడు పల్లె సత్యం, జినుక లింగయ్య, గోగు మహేష్, చిత్రకంటి శోభ, పుట్టల నాగరాజు, నల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags: