కీసర సర్కిల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు

కీసర సర్కిల్లో జోరుగా అక్రమ నిర్మాణాలు

  • పట్టించుకోని అధికారులు
  • ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

 విశ్వంభర, మేడ్చల్:  కీసర సర్కిల్లో అక్రమనిర్మాణాల జోరు అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతోంది. కొందరు అక్రమార్కులు నిబంధనలను పట్టించుకోకుండా, అధికారుల అండదండలతో రెచ్చిపోతున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కీసర, దమ్మాయిగూడ డివిజన్ల పరిధిలో అనుమతులు లేని నిర్మాణాలు దర్శనమిస్తున్నాయి.  సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కన్నెత్తి కూడా చూడటం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దమ్మాయిగూడ డివిజన్ బండ్లగూడలో ఓ అక్రమ నిర్మాణం అధికారుల పనితీరుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణంపై ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోకపోవటం శోచనీయం. ఇది అధికారుల అవినీతికి,అక్రమార్కులతో కుమ్మక్కెన తీరుకు అద్దం పడుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అక్రమార్కులతో చైన్మెన్లు కుమ్మక్కకై అన్నీ తామై నడిపిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పర్యవేక్షణ కొరవడటంతో కింది స్థాయి సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నిర్మాణదారుల నుంచి భారీగా మామూళ్లు దండుకుంటూ అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నారని, అందుకే ఫిర్యాదులు వెళ్లినా చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, క్షేత్ర స్థాయిలో పర్యటించి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 

Tags: