స్పీకర్ తీర్పుపై బీఆర్ఎస్ ఆగ్రహం
- హైకోర్టుకు వెళ్తామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ హెచ్చరిక
హైదరాబాద్, విశ్వంభర: పార్టీ మారిన ఎమ్మెల్యేల అంశంపై అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పుపై మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ తీర్పు కాపీలు ఇవ్వడం లేదని తమ తరపు న్యాయవాది సుప్రీమ్ కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా, 48 గంటల్లో తీర్పు కాపీలు అందించాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆ కాపీల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. రెండు సంవత్సరాల క్రితం తాము పిటిషన్ వేస్తే ఇప్పుడు స్పీకర్ తీర్పు ఇవ్వడం ఆశ్చర్యకరమని వినోద్ కుమార్ వ్యాఖ్యానించారు. ఫిరాయింపు నిరోధక చట్టాన్ని రాజీవ్ గాంధి హయాంలో 1985లో రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో చేర్చారని గుర్తుచేశారు. ఆ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. 2003లో అప్పటి ప్రధాని వాజపేయి కాలంలో 2/3 మంది సభ్యులు పార్టీ మారితే అనర్హత వర్తించదనే నిబంధనను చేర్చారని చెప్పారు. కాంగ్రెస్ తీసుకొచ్చిన చట్టాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని విమర్శించారు. దేశవ్యాప్తంగా రాజ్యాంగం పట్టుకుని తిరుగుతున్న రాహుల్ గాంధీ తెలంగాణలో రాజ్యాంగ ఉల్లంఘనపై స్పందించడం లేదని అన్నారు. అసెంబ్లీ స్పీకర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేశారని విమర్శించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ముఖ్యంగా కడియం శ్రీహరి, దానం నాగేందర్ పై అనర్హత వేటు పడుతుందని అందరూ భావించారని అన్నారు. అయితే దానం నాగేందర్ పార్టీ మారినట్లు ఆధారాలు లేవని స్పీకర్ తీర్పు ఇవ్వడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ బీఫామ్‌పై లోక్‌సభకు పోటీ చేసిన వ్యక్తి పార్టీ మారలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఒక వ్యక్తి ఒకేసారి రెండు లేదా మూడు పార్టీల నుంచి పోటీ చేయవచ్చా అనే విషయంపై ఎలక్షన్ కమిషన్ స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. స్పీకర్ తీర్పుపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి లలితా రెడ్డి పాల్గొన్నారు.



