విద్యార్థుల సమస్యలు  పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి 

విద్యార్థుల సమస్యలు  పరిష్కరించకుంటే అసెంబ్లీ ముట్టడి 

  •  ఎఐఎస్ఎఫ్ హెచ్చరిక 

విశ్వంభర, హైదరాబాద్ : విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని నిర్వీర్యం చేయడం సిగ్గు చేటు అని ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ విద్యారంగానికి 30 శాతం నిధులు కేటాయించడంతో పాటు విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఆధ్వరంలో శుక్రవారం  బషీర్ బాగ్ దేశోద్ధారక భవన్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ,  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరిస్కారం కాకపోవడం  దౌర్భాగ్యమన్నారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే విద్యాశాఖకు మంత్రి లేకపోవడం కాంగ్రెస్ పాలన వైఫల్యానికి నిదర్శనమని, తక్షణమే విద్యాశాఖ మంత్రిని నియామించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పాల్గొంటున్న ప్రతి కార్యక్రమంలో పేదలకు నాణ్యమైన విద్య, వైద్యం అందిస్తానని, ప్రగల్భాలు పలుకుతున్నారని, కానీ క్షేత్రస్థాయిలో సరైన మౌళిక వసతులు లేక ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత చదువులు  చదువుకుంటే తమను ప్రశ్నించడం ప్రారంభిస్తారని, తద్వారా తమ ఉనికిని కోల్పోవాల్సి వస్తుందని, నాయకులు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శించారు. కొఠారీ కమిషన్ నివేదిక ప్రకారం 30 శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందని చెప్పినా, ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయడం లేదని తెలిపారు. ఇటీవల విద్యాశాఖ కమిషన్ సమర్పించిన నివేదికను బహిర్గతం చేసి, అందులోని అంశాలపై విద్యావేత్తలతో చర్చలు జరపాలని, నివేదికలో సూచించినట్లు ప్రతి మండల కేంద్రానికి 5 నుంచి 6 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టిపిఎస్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. పెండింగ్ లోఉన్న విద్యార్థుల ఫీజు రేయింబర్సుమెంట్, స్కాలర్ షిప్స్ వెంటనే విడుదల చేయాలనీ వారు డిమాండ్ చేసారు. పేద విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్య అందించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో నిధులు కేటాయించాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థి లోకాన్ని సంఘటితం చేసి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించడం తో పాటు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తామని మణికంఠరెడ్డి, పుట్ట లక్ష్మణ్ హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎఐఎస్ఎఫ్  రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యార నరేష్, నాయకులు హరీష్, అన్వర్ తదితరులు పాల్గొన్నారు.

Tags: