అక్రమ మొరం దందాపై పోలీసుల ఉక్కు పాదం
- తవ్వకాలకు ఉపయోగించిన పలు యంత్రాలు , వాహనాలు స్వాధీనం
విశ్వంభర, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో జరుగుతున్న అక్రమ మొరం దందాపై పోలీసులు ఉక్కు పాదం మోపారు. గత కొంతకాలంగా నందిపేట్ ప్రాంతంలోని పలుగుట్ట వెనుకవైపు జరుగుతున్న అక్రమ మొరం తప్పకాలపై పక్కా సమాచారం మేరకు సోమవారం మెరుపు దాడి చేశారు. అక్రమ తవ్వకాలకు ఉపయోగించిన యంత్రాలతో పాటు రవాణాకు సంబంధించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య ఆదేశాల మేరకు సి సి ఎస్ ఏసీపీ మస్తాన్ అలీ ఆధ్వర్యంలో సి సి ఎస్ సిబ్బంది అక్రమ మొరం తవ్వకాలపై మెరుపుదాడి నిర్వహించారు. నందిపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలుగుట్ట వెనుక భాగంలో అక్రమంగా మొరం తవ్వకాలు జరుగుతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమ తవ్వకాలకు ఉపయోగిస్తున్న 3 టిప్పర్లు, 2 జెసిబి యంత్రాలు, 1 ట్రాక్టర్ ను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను తదుపరి చర్యల కోసం నందిపేట్ పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ శ్యామ్ రాజ్ కు అప్పగించినట్లు అధికారులు తెలిపారు.



