ఉపాధ్యాయ లోకంలో తీరని విషాదం: విధులకు వెళ్తుండగా ఇద్దరు టీచర్ల మృతి
జాజిరెడ్డిగూడెం వద్ద ఘోర ప్రమాదం..
సంక్రాంతి సెలవులు ముగించుకుని, కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టిన ఆ ఉపాధ్యాయులను విధి వంచించింది. పాఠశాల గడప తొక్కకముందే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కబళించింది.
విశ్వంభర, క్రైం న్యూస్: సంక్రాంతి సెలవులు ముగించుకుని, కొత్త ఉత్సాహంతో బడిబాట పట్టిన ఆ ఉపాధ్యాయులను విధి వంచించింది. పాఠశాల గడప తొక్కకముందే మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో వారిని కబళించింది. నల్లగొండ జిల్లా కేంద్రం నుండి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలానికి విధులకు హాజరయ్యేందుకు వస్తున్న నలుగురు ప్రధానోపాధ్యాయుల కారు జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు ఉపాధ్యాయులు మృతి చెందగా, మరో ఇద్దరు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
శనివారం ఉదయం నల్లగొండ నుంచి తుంగతుర్తి మండలానికి టీచర్లు తమ కారులో బయలుదేరారు. జాజిరెడ్డిగూడెం సమీపంలోకి రాగానే ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాద తీవ్రతకు తుంగతుర్తి కేజీబీవీ (KGBV) స్పెషల్ ఆఫీసర్ మామిడాల కల్పన అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. రావులపల్లి జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయురాలు గీతారెడ్డి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో తుదిశ్వాస విడిచారు.
ఒకే కుటుంబంలో ఇద్దరికి గాయాలు
ఈ ప్రమాదంలో తుంగతుర్తి జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అల్వాల ప్రవీణ్ కుమార్, అన్నారం జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం అల్వాల సునీత తీవ్రంగా గాయపడ్డారు. వీరిద్దరూ స్వయానా అక్కాతమ్ముడు. ప్రస్తుతం వీరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒకే ప్రమాదంలో అక్కాతమ్ముడు గాయపడటంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరణించిన గీతారెడ్డి, తుంగతుర్తి ఆర్ఐ రవీందర్ రెడ్డికి దగ్గరి బంధువు అని తెలిసింది.
కన్నీరు మున్నీరవుతున్న విద్యార్థులు
సెలవుల తర్వాత తమ పాఠశాలకు వస్తున్న సార్లకు ప్రమాదం జరిగిందని తెలియగానే విద్యార్థులు, తోటి ఉపాధ్యాయులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వారం రోజుల క్రితం తమతో కలిసి నవ్వుతూ గడిపిన వారు ఇప్పుడు లేరన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తుంగతుర్తి మండలంలోని నాలుగు పాఠశాలల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అధికారుల పరామర్శ..
ఈ విషయం తెలియగానే జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) అశోక్, సెక్టోరియల్ అధికారులు రాంబాబు, శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



